Harishrao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నోరు ఉంది కదా అని గావు పెట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతూ సీఎం కుర్చీ గౌరవాన్ని తగ్గిస్తున్నారని విమర్శించారు. ఆయన మాటలు వింటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుందని, అసత్య ప్రచారాల్లో గోబెల్స్‌ను మించిపోయారని ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెసోళ్లే కట్టామని చెబుతున్నారన్నారు. సీఎం జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతూ ఎక్కడ రిబ్బన్ కనిపిస్తే అక్కడ కత్తిరిస్తున్నాడన్నారు. సోమవారం ఆయన ప్రారంభించిన ట్యాంకులు కేసీఆర్ హయాంలో ప్రారంభించినవేనని గుర్తు చేశారు. ‘మీలాగా చిన్నగా ఆలోచించి పేర్లు మార్చాలని అనుకోలేదు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. నీలా దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయాలకు కేసీఆర్ పాల్పడలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు హై లెవెల్ బ్రిడ్జి పూర్తి కాలేదు. ఆర్అండ్ఆర్ పూర్తి కాలేదు. ల్యాండ్ అక్విజేషన్ పూర్తి కాలేదు. గ్రామాలు ఖాళీ చేయించలేదు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టును రూ.2,052 కోట్లతో పూర్తి చేసి 2016లో పూర్తిస్థాయిలో 20 టీఎంసీల నీళ్లు నింపాం. ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీలు.. డెడ్ స్టోరేజ్ మూడు టీఎంసీలు. మిగిలిన 17 టీఎంసీల్లో సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు. ఈ లెక్కన 12 టీఎంసీలు సరిపోతాయి. ఎన్టీపీసీ విద్యుదుత్పత్తికి ఆరున్నర టీఎంసీలు వెళ్తాయి. మంచిర్యాల నియోజకవర్గంలో గూడెం లిఫ్ట్ మూడు టీఎంసీలు, రామగుండం లిఫ్ట్‌కు ఒక టీఎంసీ వాడుకుంటాం. దాని సామర్థ్యం కంటే ఎక్కువే వాడుతున్నాం. ఎల్లంపల్లి కెపాసీటీకి మించి మరో 20 టీఎంసీలు హైదరాబాద్‌కు ఎలా తీసుకొస్తావ్’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్‌కు నీళ్లు గాలిలో వస్తున్నాయా అంటూ దుయ్యబట్టారు. ‘ఎల్లంపల్లిలో మోటర్లు ఆన్ చేస్తే మేడారం రిజర్వాయర్‌లోకి వస్తాయి. లక్ష్మీ పంప్‌హౌస్ ఆన్ చేస్తే కాలువల నుంచి మిడ్ మానేరుకు.., అక్కడి నుంచి అనంతగిరి రిజర్వాయర్‌కు.., అక్కడి నుంచి రంగనాయక సాగర్‌కు.., అటు నుంచి మల్లన్న సాగర్‌కు వస్తాయి. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు కాల్వలు, గ్రావిటీ కెనాల్, రిజర్వాయర్లు, సబ్ స్టేషన్లు, పంప్ హౌస్‌లన్నీ నిర్మించింది బీఆర్ఎస్ హయాంలోనే.. ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే’ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కేసీఆర్ ముందు చూపుతో హైదరాబాద్ ప్రజల తాగునీటి కోసం మల్లన్న సాగర్‌లో స్లూయిస్ (తూములు) కూడా నిర్మించారని వివరించారు. కేసీఆర్ సాధించిన విజయాలను తన విజయాలుగా చెప్పుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి నవ్వుల పాలవుతున్నాడన్నారు. టిఆర్ఎస్ వచ్చిన తర్వాత రూ.7 వేల కోట్లను హైదరాబాద్ మంచినీటి కోసం ఖర్చు చేశామన్నారు.
ఒకరేమో కాళేశ్వరాన్ని తిట్టుడు.. మరొకరు మొక్కుడు
కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, ఎగ్జామ్ పెట్టి ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేస్తే.. కేవలం కాగితం ఇచ్చి ఉద్యోగాలు నేనే ఇచ్చాను అని ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నాడని హరీశ్ రావు విమర్శించారు. ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టులోని మూడు పంప్ హౌస్‌లు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, టన్నెల్స్, సబ్‌స్టేషన్లు, కాల్వలు పూర్తి చేసింది కూడా కేసీఆరేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బటన్ నొక్కి సీతారామ ప్రాజెక్టు తామే నిర్మించామని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలన్నారు. రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వద్ద మీ మంత్రులే నీళ్లు విడుదల చేసి నెత్తిపై చల్లుకుంటున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ కట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటూ మాట్లాడుతున్న సీఎంకు చరిత్ర తెలుసా అంటూ దుయ్యబట్టారు. మల్లన్న సాగర్ 2008, 2009లో రాజశేఖర్ రెడ్డి నిర్మించాడని చెబుతున్న రేవంత్.. ముందుగా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. అనంతగిరి 1.70 టీఎంసీ, ఇమాంబాద్ రిజర్వాయర్ 1.5 టీఎంసీ, తడకపల్లి రిజర్వాయర్ 1 టీఎంసీ, తిప్పారం రిజర్వాయర్ 1 టీఎంసీ అన్నీ కలిపి ఐదు టీఎంసీలేనని ప్రాణహిత, చేవేళ్ల డీపీఆర్‌లో ప్రతిపాదించారన్నారు.
మల్లన్న సాగర్ కెపాసిటీ 50 టీఎంసీలు..
కేంద్ర ప్రభుత్వానికి 2008లో డీపీఆర్ పంపితే 2012లో డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ తిప్పి పంపింది.. ఈ ఐదు టీఎంసీలతో 16 ఎకరాలకు నీళ్లు పారవని, రిజర్వాయర్లకు కెపాసిటీ పెంచుకోండి అని డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ రిజెక్ట్ చేసిందన్నారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ఈ అబద్ధాలు విని సిగ్గుతో తలదించుకునేవారన్నారు. రేవంత్ అబద్ధాలు వింటుంటే సెక్రటేరియట్‌కు పునాదిరాళ్లు నేనే మోసాను.. అమరవీరుల స్థూపానికి కూడా నేనే మేస్త్రి.. జిల్లాల్లో కట్టిన కలెక్టరేట్లను కూడా కాంగ్రెస్ కట్టింది అని చెప్పినా ఆశ్చర్యం లేదన్నారు. చార్మినార్ మా తాత కట్టాడని చెప్పుకున్నా ఆశ్చర్య పడాల్సిన పనిలేదన్నారు. అధికార మదంతో, ధన బలంతో తిమ్మిని బమ్మిని చేద్దామంటే జనం సహించరని, ఏదోరోజు తిప్పికొడతారన్నారు. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి జనం బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హరీశ్‌రావు హెచ్చరించారు.


