Monday, March 31, 2025
Homeపాలిటిక్స్Anitha: తెలుగుదేశం పార్టీకి బలం, బలగం కార్యకర్తలే :హోంమంత్రి అనిత

Anitha: తెలుగుదేశం పార్టీకి బలం, బలగం కార్యకర్తలే :హోంమంత్రి అనిత

తెలుగుదేశం పార్టీకి బలం, బలగం కార్యకర్తలేనని హోంమంత్రి(Home Minister Anitha) వంగలపూడి అనిత వెల్లడించారు. అవమానాలు, సంక్షోభాలెన్నొచ్చినా పసుపుజెండా రెపరెపలాడుతూనే ఉంటుందని ఆమె స్పష్టవ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 43వ టీడీపీ ఆవిర్భావ వేడుకలకు( TDP Formation Day) తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అనిత హాజరయ్యారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రజలకు 2047 నాటికి ఏం కావాలి.. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధి ఎలా జరగాలి అని ప్రణాళికలు వేసుకుంటూ ప్రతి ఒక్కరి భవిష్యత్ మార్చే దిశగా శ్రద్ధగా రాసుకుంటున్నవ్యక్తి చంద్రబాబు అన్నారు.

- Advertisement -

మనకు ఏం కావాలో ఆలోచిస్తూ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటూ నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు అని చెప్పారు. “నేను కమ్యూనిస్టునో.. సోషలిస్టునో.. క్యాపిటలిస్టునో కాను.. ప్రజల మేలు కోరే హ్యూమనిస్టును” అని ఆనాడు ఎన్టీఆర్ చెబితే..ఆ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు తనకి తండ్రి సమానులన్నారు. అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు దార్శనికతకు నిదర్శనంగా “నాయుడు డే”ని ప్రకటించిన విషయాన్ని హోంమంత్రి గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్-2020 అన్నప్పుడు నవ్వారు.. ఇప్పుడు ఫలాలను కళ్లారా చూస్తున్నారన్నారు. హైటెక్ సిటీ,ఎయిర్ పోర్ట్,ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాలు సహా హైదరాబాద్ అభివృద్ధి విజనరీ లీడర్ బాబు చలువేనన్నారు. పేదరిక నిర్మూలన , తలసరి ఆదాయం పెంపు లక్ష్యంగా పీ4 విధానాన్ని ఉగాది సందర్భంగా ప్రారంభించబోతున్నారని హోంమంత్రి పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్- 2047 కు అమరావతి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలవడం ఖాయమని తెలిపారు. తరాలు మారినా చరిత్రలో అమరావతి పేరు వినగానే చంద్రబాబే గుర్తొచ్చేలా అభివృద్ధి చేసి చూపుతారన్నారు.

2020 విజన్ గురించి మాట్లాడుకునే సమయానికి తానొక సాధారణ స్టూడెంట్ అని.. ఆ కల తీరే సమయానికి మహిళా అధ్యక్షురాలిగా చంద్రబాబు పక్కన కూర్చునే స్థాయికి ఎదిగానన్నారు. అదే చంద్రబాబు గారి దార్శనికతకు ఉదాహరణ అన్నారు. ప్రతిపక్షమైనా, అధికారంలో ఉన్నా ప్రతి క్షణం ప్రజలకోసమే తపించే వ్యక్తి సీఎం చంద్రబాబు అన్నారు. కసరత్తు చేసి ప్రణాళికతో వెళ్లినా తన శాఖలపై సమీక్షలో చేర్చని అంశాలను సైతం ప్రశ్నించగల సూక్ష్మరంధ్రాన్వేషి చంద్రబాబు అన్నారు.

ఇటీవల ఒక ప్రాణం కాపాడేందుకు సొంత ఖర్చుతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుండె మార్పిడి చేయించిన నారా లోకేష్.. తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడు అని నిరూపించుకున్నారని హోంమంత్రి పేర్కొన్నారు. తన రాజకీయ అనుభవం 12 ఏళ్లు అని.. 43 ఏళ్ల టీడీపీ ప్రయాణంలో పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నాయకులు, కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. తెలుగుదేశం పార్టీ కష్టనష్టాల్లో అండగా నిలిచేవారున్నంత కాలం పార్టీకి తిరుగులేదని హోంమంత్రి అనిత వెల్లడించారు. చంద్రబాబు జైలుకెళ్లినపుడు రోడ్లపైకి వచ్చి తెగువతో పోరాడిన పార్టీ శ్రేణుల రుణం తీర్చుకోలేదన్నారు. జై తెలుగుదేశం నినాదం వింటే నీతి, నిజాయితీపరుల గుండెలు ఉప్పొంగుతాయన్నారు. అవినీతిపరులు, అవినీతిమయమైన పార్టీలకు ఆ నినాదం వింటే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అన్నారు.

తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆనాడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగుదేశం అన్నారు. రాజకీయ పార్టీలకు మానవత్వాన్ని అలవరిచిన నాయకులు ఎన్టీఆర్,చంద్రబాబు,లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తండ్రి స్థానంలో నిలబడి ప్రతి తెలుగువాడికి నేనున్నాను అని భరోసా ఇస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు.ఎన్నో ఒడిదుడుకులు, విమర్శలు ఎదురైనా చిరునవ్వే సమాధానంగా పార్టీ గురించి, ప్రజల గురించి కార్యకర్తలు, నాయకుల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు చంద్రబాబేనని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News