Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Kaushik Reddy: హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి ప్రభంజనం

Kaushik Reddy: హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి ప్రభంజనం

అడుగడుగునా జన నీరాజనం

ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డిని ప్రకటించిన తర్వాత నియోజకవర్గానికి మొదటిసారి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.. హైదరాబాద్‌ నుంచి హుజురాబాద్ కు శనివారం సాయంత్రం వచ్చిన కౌశిక్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు నుంచి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. నియోజకవర్గ పరిధిలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, ఇల్లందకుంట మండలాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ శ్రేణులు తరలివచ్చి స్వాగత ర్యాలీలో పాల్గొన్నారు. కౌశిక్ రెడ్డి ఆర్టీసీ బస్ డిపో క్రాస్ వరకు చేరుకొని ప్రచార వాహనంపై ఎక్కగానే బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు క్రేన్ సహాయంతో గజమాలను వేయడం ఆశీర్వాద సభకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఆర్టీసీ డిపో క్రాస్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బానసంచ కాలుస్తూ డబ్బు చప్పుళ్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అడుగడుగున పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాలు, పూలమాలలతో సన్మానం చేసి ఘనంగా స్వాగతించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ అని బిజెపి ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామాల అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఎంతో ఉందన్నారు. కౌశిక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వడం లేదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం సరైన విధానం కాదన్నారు. బండి సంజయ్ కరీంనగర్ కు చేసింది ఏమి లేదని అన్నారు. కేబుల్ బ్రిడ్జి ఇచ్చిన ఘనత తనదేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో పేరుకుపోయిన సమస్యలన్నీటిని పరిష్కరించడమే తన ఏకైక లక్ష్యమని అన్నారు. 50వేల పై చీలుకు మెజార్టీ తగ్గకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో మూడు కొత్త మండలాల మండలాల ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. హుజురాబాద్ అభివృద్ధి తన ఎజెండాగా పనిచేస్తానని, హుజురాబాద్ లో మినీ కలెక్టరేట్, కొత్త బస్టాండ్ అండర్ బ్రిడ్జి, స్పోర్ట్స్ స్టేడియం కట్టిస్తానని హామీ ఇచ్చారు. అన్ని కుల సంఘాలకు భవనాలను కట్టిస్తానని, జమ్మికుంట ఒక బిజినెస్ సెంటర్ చేస్తానని, ఔటర్ రింగ్రోడ్, గెస్ట్ హౌస్ లు అండర్ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఇల్లందకుంట టెంపుల్ ను డెవలప్ చేస్తానని అన్ని మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన నిధులపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో సిద్దిపేట లాగా హుజురాబాద్ ను కూడా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఈ రెండేళ్లలో చేసింది ఏం లేదన్నారు. నా జీవితమే హుజురాబాద్ ప్రజలకు అంకితం అన్నారు. 20 ఏళ్లు ఈటలకు అవకాశం ఇచ్చారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి కౌశిక్ అంటే మీ మనిషినని నిరూపించుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, నియోజకవర్గ పరిధిలోని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News