నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) లో వివాదం ముదిరి పాకాన పడింది. గత తొమ్మిదేండ్లుగా ఒకే వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతుండటంపై వివాదం రాజుకుంది. దీంతో NSUI రెండుగా చీలిపోయింది. రాష్ట్ర అధ్యక్షున్ని వెంటనే తప్పించాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్ రావు థాకరే, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో మార్చక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రంలో బలమైన విద్యార్థి సంఘంగా ఉన్న NSUI లో అధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడిగా కొనసాగుతున్న బల్మూరి వెంకట్ గత 9 సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగటంలో ఆంతర్యం ఏంటంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అటు హజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా, ఇటు NSUI రాష్ట్ర అధ్యక్ష్యుడిగా ఆయన కొనసాగుతుండటం వల్ల ఏ పదవికి న్యాయం చేయలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. విద్యార్ధులకు సమయం కేటాయించక పోవడాన్ని కూడా వారు నిలదీస్తున్నారు.
బల్మూరి రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పై పోరాడకుండా వ్యక్తి గత ప్రయోజనాలకు పాకులాడుతున్నారనే విమర్శలు మూటగట్టుకున్నారు. ఉదయ పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీ పదవులలో 5 సంవత్సరాలకు మించి ఉండరాదనే నిబంధనను ఆయన ఉల్లంఘించారని పార్టీ ఆధిష్టానానికి ఫిర్యాదుల వెల్లువెత్తాయి.
వెంకట్ అనుసరిస్తున్న విధానాల వల్ల తెలంగాణ యూనివర్సిటీలలో NSUI కనుమరుగయ్యే దుస్థుతి దాపురించిందని ఆవేదన వ్యక్తం అవుతోంది. విద్యార్ధి సంఘంలో ఎలాంటి అర్హత లేకున్నా తన అనుయాయులకు పదవులను కట్ట బెడుతూ, సంఘం ప్రతిష్టను మసక బారుస్తున్నారని ఆందోళన తారాస్థాయికి చేరింది.
మార్పు తప్పదన్నమాట..
రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకటపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనను తప్పించడం తథ్యమనే వాదన వినిపిస్తోంది. ఇటీవల అతనిపై పార్టీ అధిష్టానానికి పలువురు NSUI అసమ్మతి నాయకులు చేసిన ఫిర్యాదులను సీరియస్ గా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. పార్టీ నియమాళికి వ్యతిరేకంగా 9 సంవత్సరాలు ఒకే వ్యక్తి పదవిలో కొనసాగడం, జోడు పదవులను నిర్వహిస్తూ దేనికీ న్యాయం చేయక పోవడం వంటి పలు అంశాలను అధిష్టానం పరిగణంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి త్వరలో త్వరలో NSUI రాష్ట్ర అధ్యక్షుడిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించటం ఖాయంగా మారిందన్నమాట.