హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన కుర్మయ్యగారి నవీన్ కుమార్ 1978 మే 15న జన్మించారు. వారి తల్లిదండ్రులు కొండల్ రావు, తిలోత్తమ గార్లు. నవీన్ కుమార్ తాత రామచంద్రరావు గతంలో మంత్రిగా పనిచేశారు. నవీన్ కుమార్ మేనమామ సుదర్శన్ రావు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. విద్యార్థి దశ నుంచే నవీన్ కుమార్ కు రాజకీయాలంటే ఆసక్తి.
2001 నాటి జలదృశ్యం ఆవిర్భావ సభ మొదలుకొని టీఆర్ఎస్ నిర్వహించిన అన్ని సమావేశాల్లో నవీన్ క్రియాశీలంగా పనిచేశారు. వ్యాపారం, రాజకీయాలతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా నవీన్ కుమార్ చురుగ్గా పాల్గొంటారు.
కూకట్ పల్లి హైదర్ నగర్ లో సొంత ఖర్చులతో వెంకటేశ్వర ఆలయాన్ని నవీన్ కుమార్ నిర్మించారు. ఆయన 2019 మే నెలలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 మార్చి వరకు ఆయన పదవీకాలం పూర్తవుతుంది. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ గారు నవీన్ కుమార్ కు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
ఈ నెల తొమ్మిదిన ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ నామినేషన్ పత్రాలు నవీన్ సమర్పించనున్నారు.