తనయుడి కోసం తండ్రి… తండ్రి కోసం తనయుడు..ఇది హుస్నాబాద్ లో కనిపిస్తున్న హైలైట్. సతీష్ కుమార్ విజయం కోసం తండ్రి కెప్టెన్, తనయుడు ఇంద్రనీల్ ప్రచారం చేస్తుండగా మరోవైపు సతీష్ సతీమణి, కుమార్తె కూడా ప్రచారంలో నిమగ్నమయ్యారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీష్ కుమార్ విజయం కోసం తండ్రి, కుమారులు పోటీపడి ప్రచారం చేస్తున్నారు. వీరి ప్రచారం చూపరులను కట్టిపడేస్తోంది. మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు తనయుడు వొడితల సతీష్ కుమార్ మూడోసారి హుస్నాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సతీష్ కుమార్ గత నెల రోజులుగా గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. గ్రామాల్లో సభలు సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే మెజారిటీ గ్రామాల్లో ప్రచారం పూర్తి చేసారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సతీష్ కుమార్ ప్రచారానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. జనం జేజేలు కొడుతున్నారు.
మనవడితో పోటీ పడుతూ తాత ప్రచారం
ఒకవైపు బీ ఆర్ ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతుండగా మరోవైపు అయన తండ్రి గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తూ.. కార్యకర్తలకు, వివిధ సామజిక వర్గాల పెద్ద మనుషుల సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని, మళ్ళీ సి ఎం కాగా కేసీఆర్ అధికారంలోకి రావాలని, హుస్నాబాద్ లో తన కుమారుడు సతీష్ కుమార్ ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. గ్రామాలకు ప్రచారం నిమిత్తం వెళ్తున్న కెప్టెన్ కు ఆ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. చాలా రోజుల తర్వాత కెప్టెన్ తమ గ్రామానికి వచ్చారని చెప్తూ నాటి ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తు చేస్తూ.. భావోద్వేగానికి గురవుతున్నారు.
సి ఎం కేసీఆర్ వెంట నడిచి ఉద్యమంలో కీలక భూమిక పోషించారని, తమ గ్రామానికి కెప్టెన్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సతీష్ కుమార్ తనయుడు, కెప్టెన్ మనుమడు ఇంద్రనీల్ యువత, విద్యార్థులను ఆకర్షిస్తూ.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన తండ్రి సతీష్ కుమార్ గెలుపు కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. యువత, విద్యార్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇప్పటికే ఇంద్రనీల్ మెజారిటీ గ్రామాల్లో బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు. బూత్ కమిటీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు తాజాగా డోర్ టూ డోర్ ప్రచారం కూడా ప్రారంభించారు. డోర్ టూ డోర్ ప్రచారంలో తన తండ్రి చేసిన అభివృద్ధి వివరిస్తూ… బీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తాత కెప్టెన్ తో పోటీ పడుతూ మనవడు.. మనవడితో.. పోటీ పడుతూ… తాత సతీష్ కుమార్ విజయం కోసం పనిచేయడం ప్రజల్లో ఆసక్తి కలిగించడమే కాక.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. మరోవైపు సతీష్ కుమార్ కుమార్తె డా. పూజిత.. తన తండ్రి నామినేషన్ రోజు కోలాటం, బతుకమ్మ ఆడుతూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సతీష్ కుమార్ విజయం కోసం ఒకవైపు తనయుడు, మరోవైపు తండ్రి ప్రచారం అదనపు బలంగా మారుతోంది.