కాంగ్రెస్ పార్టీ తేలు వంటిదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్ ను నమ్ముదామా లేదా కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా అన్నది ఆలోచించాలని కోరారు. ఆ రెండు పార్టీలు ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించవని విమర్శించారు. నిత్యం తెలంగాణ ప్రజల బాగు కోసం ఆలోచించే సీఎం కేసీఆర్ ను మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
నందిపేట్ మండలంలో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డితో కలిసి కవిత గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ప్రసంగిస్తూ…
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల గురించి ఆలోచించవని విమర్శించారు. చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్ ను నమ్ముదామా లేదా కొత్త కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా అన్నది ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తేలు వంటిదని ధ్వజమెత్తారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అంటున్నదని, 10 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ ఏం చేసిందని నిలదీశారు. కర్నాటకలో అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయడం లేదని, పెన్షన్లు, కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. గతంలో ఆ రాష్ట్రంలో 9 గంటలు వస్తున్న కరెంటును 5 గంటలకు పరిమితి చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మరొకసారి మోసపోదామా లేదా మంచి పనులు చేస్తున్న కారు గుర్తుకు ఓటేద్దామా అన్నది ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గతంలో కాంగ్రెస్ హయాంలో రూ. 200 మాత్రమే పెన్షన్ ఇచ్చేవాళ్లని, ఇప్పుడు ఊరిలో ఎంత మంది అర్హులు ఉంటే అంతమందికి రూ. 2 వేల పెన్షన్లను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని వివరించారు. ఎన్నికల పూర్తయిన వెంటనే ఆ మొత్తాన్ని రూ. 3 వేలకు పెంచాలని, ఐదేళ్లలో వాటిని రూ. 5 వేలకు పెంచుకుంటూ వెళ్లాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మూడో సారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు అందిస్తామని ప్రకటించారు.
55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సకాలంలో ఎప్పుడూ ఎరువులు అందించలేదని, సాగు, తాగు నీళ్లు ఇవ్వలేదని, అటువంటి పార్టీ మనకు అవసరమా అన్నది ఆలోచించాలని కోరారు. ఏమీ ఆదారంలేని పేద మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పేరిట రూ. 3 వేల పెన్షన్ ను అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని వివరించారు. ఆర్థిక భారం తగ్గించాలన్న ఉద్ధేశంతో కూ. 1200 గా ఉన్న గ్యాస్ సిలిండర్ ను రూ. 400కే సబ్సిడీ కింద ఇస్తామని అన్నారు. రైతు బంధు మొత్తం పెంపు, సన్న బియ్యం పంపిణీ, కేసీఆర్ రక్ష బీమా పథకాల గురించి వివరించారు. జీవన్ రెడ్డిని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.