అరెస్టై, విజయవాడలోని కృష్ణా జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. వంశీ సతీమణి పంకజశ్రీతో కలిసి, ఆయన జైలు లోపలికి వెళ్లారు. పార్టీ సీనియర్ నేతలు, నాయకులు వచ్చినా, ఎవరినీ లోపలికి అనుమతించ లేదు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా బయటే నిలువరించారు. మరోవైపు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో జైలు పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి. అయితే వారందరినీ పోలీసులు చాలా దూరంలోనే అడ్డుకున్నారు.
వల్లభనేని వంశీని పరామర్శించిన అనంతరం, జైలు బయట మీడియాతో మాట్లాడిన వైయస్ జగన్, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, ప్రభుత్వ కక్ష సాథింపు చర్యలను ఎండగట్టారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని, ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి, బట్టలు ఊడదీసి, చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.
వంశీ ఏ తప్పూ చేయకున్నా:
ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు అద్దం పడుతోంది. వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్లయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తోంది. ఈ కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో పని చేస్తున్నారు. ఈ వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జ్ గారి సమక్షంలో వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలంలో ఆయన వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికీ కూడా వంశీపై తప్పుడు కేసును బనాయించారు.
ఇదీ కేసు చరిత్ర:
2023, ఫిబ్రవరి 19న మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో పట్టాభి అనే వ్యక్తితో వంశీపై భరించలేని విధంగా చంద్రబాబు బూతులు తిట్టించారు. ‘వాడో పిల్ల సైకో. నేనే గన్నవరం వెడతా. ఎవడేం పీకుతాడో చూస్తా. ఆ వంశీ సంగతి చూస్తా. నియోజకవర్గం నుంచి బయటకు విసిరేస్తా’.. అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పట్టాభి రెచ్చగొట్టారు. మర్నాడు ఫిబ్రవరి 20న అదే పట్టాభిని చంద్రబాబు గన్నవరం పంపారు. అక్కడ పట్టాభి మళ్ళీ ప్రెస్‌మీట్ పెట్టి వంశీని తిట్టారు. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పోగేసిన మనుషులను వెంట పెట్టుకున్న పట్టాభి, ఒక ప్రదర్శనగా వైయస్సార్‌సీపీ ఆఫీస్‌పై దాడికి బయలు దేరాడు. వైయస్సార్‌సీపీ ఆఫీస్ చేరుకున్న వారు, అక్కడ శీనయ్య అనే దళిత సర్పంచ్‌పై దాడి చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన గన్నవరం సీఐ కనకారావుపైనా వారు దాడి చేయడంతో ఆయన తల పగిలింది. ఆయన కూడా దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి.
పెద్ద సంఖ్యలో టీడీపీ వారు దాడికి సిద్ధం కావడంతో వారిని ప్రతిఘటించేందుకు వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు గట్టిగానే ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఇరువైపుల వారిపై కేసు నమోదు చేశారు. నిజానికి ఆరోజు మా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించలేదు. పోలీసుల చర్యలను అడ్డుకోలేదు. కేసు నుంచి బయటపడే ప్రయత్నమూ చేయలేదు.

ఎక్కడా వంశీ ప్రమేయం, పేరు లేకున్నా:
వైయస్సార్‌సీపీ ఆఫీస్‌పై దాడికి ప్రయత్నించిన టీడీపీ వారు మూడు ఫిర్యాదులు ఇవ్వడంతో, పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. అయితే వాటిలో ఎక్కడా వంశీ పేరు లేదు. ఆ ఫిర్యాదుల్లోనూ, పోలీసులు సుమోటోగా పెట్టిన కేసుల్లోనూ ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. కారణం ఆ ఘటన జరిగినప్పుడు వంశీ అక్కడ లేరు.
అది జరిగిన రెండు రోజుల తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో డీటీపీ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ అనే దళిత యువకుడిని మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్‌కు చంద్రబాబు మనుషులు పిలిపించారు. సత్యవర్థన్‌తో తెల్లకాగితంపై సంతకం తీసుకుని మరో ఫిర్యాదు ఇప్పించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసులో కూడా వంశీ పేరు లేదు. 2023 ఫిబ్రవరి 23న పోలీసులు సత్యవర్థన్ నుంచి 161 స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అందులోనూ వంశీ పేరు, ప్రసావన లేదు.

టార్గెట్ వంశీ కేసు రీఓపెన్:
మళ్లీ టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. 2024 జూలై 10న ఆ కేసును రీఓపెన్ చేశారు. ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే.. ఇదే సత్యవర్థన్‌తో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండోసారి 161 స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్‌మెంట్‌లో కూడా తనను ఎవరూ దూషించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వల్లభనేని వంశీ లేడని స్పష్టంగా చెప్పాడు. ఇంకా ఆ ఘటన జరుగుతున్నప్పుడు తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానంటూ తొలి స్టేట్‌మెంట్‌లో చెప్పిందే రిపీట్ చేశాడు.
అయినా వంశీపై చంద్రబాబు పెట్టుకున్న ఆక్రోషం, కోపం ఏ స్థాయిలో ఉందంటే.. ఎలాగైనా సరే వంశీని ఈ కేసులో ఇరికించాలని, దాడి ఘటనా స్థలంలో లేకపోయినా కూడా వంశీని ఈ కేసులో 71వ నిందితుడుగా చేర్చారు. అయితే ఆ కేసులోనివి బెయిలబుల్ సెక్షన్లు కాబట్టి, ముందస్తు బెయిల్ కోసం అప్పటికే వంశీ హైకోర్ట్‌ను ఆశ్రయించాడు.
దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీకి బెయిల్ రాకూడదనుకున్న చంద్రబాబు కుట్రను మరింత ముందుకు తీసుకువెళ్లారు. గన్నవరం పార్టీ ఆఫీస్‌ను తగలబెట్టే ప్రయత్నం చేశారంటూ మరో తప్పుడు కేసు నమోదు చేశారు. నిజానికి అది జరగకపోయినా, చంద్రబాబు కట్టుకథ అల్లారు. ఎందుకంటే, ఆ ఆఫీస్ భవనం యజమానులు ఎస్సీ, ఎస్టీలైతే, వారితో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించవచ్చని భావించి, వెంటనే ఆ ఆఫీస్ భవనం అదే సామాజికవర్గానికి చెందిన వారిదంటూ దొంగ వాంగ్మూలం కూడా ఇచ్చేశాడు.
వాస్తవానికి టీడీపీ ఆఫీస్‌ను ఎవరూ తగలబెట్టే ప్రయత్నం చేయలేదు. ఇంకా ఆ బిల్డింగ్ కూడా చంద్రబాబుకు సంబంధించిన కడియాల సీతారామయ్య అనే వ్యక్తికి చెందినది. అంటే వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి, బెయిల్ కూడా రాకూడదని చేసిన కుట్ర ప్రయత్నమిది అని అర్థమవుతోంది.
కుట్రతో బెయిల్‌నూ అడ్డుకుంటున్నారు:
ఆ కేసులో 94 మందిపై కేసు పెడితే, నెలల తరబడి వైయస్సార్‌సీపీ వారిని వేధించాలని ఇంకా 44 మందికి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. ఆ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్థన్ మేజిస్ట్రేట్ ముందు హాజరై వాంగ్మూలం ఇస్తే, వారికి కూడా బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు, పోలీసులు కలిసి కుట్ర పన్నారు. దీనిలో భాగంగానే సత్యవర్థన్‌కు 20 సార్లు కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు ఇచ్చినా ప్రతిసారీ దాటేస్తూ కోర్టుకు రాకుండా పోయాడు. చివరికి న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో, సత్యవర్థన్ తానంతట తానే న్యాయమూర్తి ముందు హాజరయ్యాడు. గతంలో తాను పోలీసులకు ఏదైతే స్టేట్‌మెంట్ ఇచ్చాడో అదే విషయాలు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో తాను లేనని, తనను ఎవ్వరూ కులం పేరుతో దూషించలేదని చెప్పాడు. అసలు ఈకేసుతో తనకు సంబంధం లేదని కోర్టుకు మొర పెట్టుకున్నాడు.
పోలీసులతో కలిసి తండ్రీ కొడుకుల కుట్ర:
ఇంకా తన తల్లితో కలిసి ఆటోలో కోర్టుకు వచ్చానని, తన స్టేట్‌మెంట్ వెనక ఎవరి బలవంతం లేదని సత్యవర్థన్ మొన్న 2025 ఫిబ్రవరి 10న జడ్జిగారి ముందు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో చంద్రబాబుగారు, లోకేష్ లకు మనశ్శాంతి లేకుండా పోయింది. మళ్లీ వీరు పోలీసులకు కలిసి కుట్ర పన్నారు.
అందులో భాగంగా ఆ మర్నాడే.. సత్యవర్థన్ కోర్టును తప్పుదోవ పట్టించడంతో పాటు, తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడంటూ ఫిబ్రవరి 11న, విజయవాడ, పటమట పీఎస్‌లో సత్యవర్థన్ మీద ఒక ఎఫ్‌ఐఆర్ పెట్టి, దాన్ని వారి కుటుంబ సభ్యులకు చూపించి బెదిరించారు. ఆ వెంటనే ఫిబ్రవరి 12న, సత్యవర్థన్ వద్ద ఉన్న రూ.20వేలు లాక్కుని, అతణ్ణి కిడ్నాప్ చేశారని, దాన్ని ఎవరో చూసి తనకు చెప్పారంటూ, సత్యవర్థన్ అన్నతో పోలీసులకు ఒక ఫిర్యాదు చేయించి వెంటనే కేసు రిజిస్టర్ చేశారు. ఆ మర్నాడు ఫిబ్రవరి 13న తెల్లవారుజామున వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం సత్యవర్థన్ స్టేట్‌మెంట్ నమోదు చేశారు. అందులో వంశీ పేరు చెప్పించారు.
‘అంటే ఎవరైతే కిడ్నాప్ అయ్యారని చెబుతున్నారో అతణ్నుంచి ఏ స్టేట్‌మెంట్ తీసుకోకుండానే వంశీని తెల్లవారుజామునే అరెస్ట్ చేశారు. ఆ సాయంత్రం సత్యవర్థన్ స్టేట్‌మెంట్ నమోదు చేశారంటే, ఎంత కుట్రపూరితంగా ఈ అరెస్ట్ జరిగిందో అర్థమవుతోంది’.
ఒక మనిషి తప్పు చేస్తే, అతడిని శిక్షిస్తే పోలీసులకు ఒక గౌరవం ఉంటుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో తమకు నచ్చని వారిపై దొంగ సాక్ష్యాలు సృష్టించి, దొంగ కేసులు పెట్టి నెలల తరబడి జైళ్లలో ఉంచుతున్నారు. దీనికి వంశీపై పెట్టిన కేసు ఒక నిదర్శనం.

ప్రజాస్వామ్యం దిగజారిపోయింది:
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దిగజారిపోయింది. పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో మొత్తం 33 కౌన్సిలర్ స్ఠానాల్లో అన్నింటినీ వైయస్సార్‌సీపీ గెల్చుకుంది. టీడీపీకీ కనీసం ఒక్కరు కూడా లేరు. కానీ నిన్న (సోమవారం) జరిగిన పిడుగురాళ్ళ మున్సిపల్ వైస్‌ఛైర్మన్ ఎన్నికలో ఒక్క సభ్యుడు కూడా లేని తెలుగుదేశం పార్టీ, ఏ మాత్రం సిగ్గు లేకుండా తామే ఆ ఎన్నికలో గెల్చామని చెప్పుకోవడం చూస్తే చంద్రబాబు హయాంలో పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారో చెప్పడానికి నిదర్శనం.
తిరుపతి కార్పోరేషన్‌లోని 49 డివిజన్లలో 48 చోట్ల వైయస్సార్‌సీపీ గెలవగా, కేవలం ఒకే డివిజన్‌లో టీడీపీ గెల్చింది. అలాంటి చోట పోలీసుల ఆధ్వర్యంలో, కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన తెలుగుదేశం, డిప్యూటీ మేయర్ పదవి గెల్చుకున్నామని గొప్పగా చెప్పుకుంటోంది. అంటే అక్కడ కూడా పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు.
తుని మున్సిపాలిటీలో మొత్తం 30 స్థానాలు వైయస్సార్‌సీపీ గెల్చుకుంది. అలాంటి చోట తెలుగుదేశం పార్టీ వైస్‌ఛైర్మన్ పదవి ఎలా గెల్చుకుంటుంది? అక్క డ దౌర్జన్యం చేసి వైయస్సార్‌సీపీ కౌన్సిలర్లను తీసుకువెళ్ళేందుకు అవకాశం లేకపోవడంతో చివరికి తెలుగుదేశం పార్టీ ఒత్తిడితో ఎన్నికనే వాయిదా వేయించారు. అంటే వారికి అనుకూల పరిస్థితి వచ్చే వరకు ఆ ఎన్నిక జరపరు.
పాలకొండలో వైయస్సార్‌సీపీకి 17 స్థానాలు ఉంటే, టీడీపీకి కేవలం మూడు స్థానాలు ఉన్నాయి. అక్కడ వైస్‌ఛైర్మన్ పదవి వైయస్సార్‌సీపీ దక్కించుకుంటుందని ఎన్నికను వాయిదా వేయించారు. పోలీసులను ఇష్టానుసారంగా వాడుకుని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు.

బట్టలు ఊడదీసి చట్టం ముందు:
ఈరోజు ప్రతి పోలీస్‌కు చెబుతున్నాను, మీ టోపీలపై కనిపించే ఆ మూడు సింహాలకు సెల్యూట్ కొట్టండి. కానీ తెలుగుదేశం నాయకులకు కాదు. వారు చెప్పినట్లు చేయడం మొదలు పెట్టి అన్యాయాలు చేస్తే ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదని ప్రతి అధికారికి తెలియచేస్తున్నాను.
రేపు మా అధికారం వస్తుంది. అన్యాయం చేసిన ఈ అధికారులు, నాయకులను తప్పనిసరిగా చట్టం ముందు నిలబెడతామని తెలియచేస్తున్నాను. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేప్పుడు సీఐ అన్నారట తాను ఏడాదిన్నర తర్వాత రిటైర్ అవుతాను అని.
‘రిటైర్ అయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ పిలిపిస్తాం, చట్టం ముందు నిలబెడతాం. న్యాయం జరిగేట్టుగా చేస్తామని ప్రతి ఒక్కరికీ తెలియచేస్తున్నాను. ఈ మాదిరిగా అన్యాయం చేస్తే ఖచ్చితంగా ప్రజలు, దేవుడు వీరిని శిక్షించే కార్యక్రమం జరుగుతుందని మరోసారి చెబుతున్నాం. అన్యాయంలో భాగస్వాములు కావొద్దు. మీ టోపీలపై ఉన్న సింహాలను గౌరవించండి. వాటికి సెల్యూట్ కొట్టండి. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రతి అధికారికి తెలియచేస్తున్నాం.
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ఇల్లీగల్ కేసు:
ప్రజాస్వామ్యం కూలిపోతోందనేందు ఇవన్నీ నిదర్శనం. ప్రతి కేసు ఇల్లీగల్ కేసే. ప్రతి కేసులోనూ వీరే బెదిరిస్తున్నారు. తిరిగి తమనే బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడుతున్నారు. అసలు ఎవరు ఎవరిని బెదరిస్తున్నారు?.
ప్రతి విషయంలోనూ వీరే. పారిశ్రామికవేత్తలను, రాజకీయనేతలను వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరినీ వీరే బెదరించి, అవతలి వారు బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇవ్వన్నీ ఊరికే పోవు. వారికి తప్పకుండా చుట్టుకుంటాయి. అప్పుడు వారి పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది.
అందుకే వంశీ టార్గెట్:
వంశీని ఇంతగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఆయన చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. రాజకీయంగా ఎదుగుతున్నాడు. చంద్రబాబు, లోకేష్ కంటే గ్లామరస్‌గా ఉన్నారని, వల్లభనేని వంశీతో పాటు, కొడాలి నానిపై జీర్ణించుకోలేని ఆక్రోశం. అవినాశ్ కూడా లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు టార్గెట్ అవుతారు. ఇదీ చంద్రబాబు మనస్తత్వం. చంద్రబాబు, ఆయన కొడుకు ఆ సామాజికవర్గంలో వారు మాత్రమే లీడర్లు. వారికి అనుకూలంగా లేని వారిని ఆ సామాజికవర్గం నుంచి వెలేస్తారు.

మాజీ మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎం.అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, నల్లగట్ల స్వామిదాసుతో పాటు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.