Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Jaya Jayahe Telangana: జయజయహే తెలంగాణ పూర్తి పాట తెలుసా?

Jaya Jayahe Telangana: జయజయహే తెలంగాణ పూర్తి పాట తెలుసా?

మార్పులెందుకు చేయాలి?

జూన్ 2తో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి 10 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ కవి అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి సర్కారు అధికారికంగా తెలంగాణ జాతికి అంకితం చేయనుంది. ఈ పాటను స్వరపరచి, పాడి, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లటాన్ని రేవంత్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. అందుకే ఎంఎం కీరవాణికి ఈ పాటను అప్పగించారు. అయితే కీరవాణి పొరుగు రాష్ట్రం వాడని, ఆయన స్వరపరచి, పాడటం ఏంటని పలువురు మండిపడుతున్నారు. రేవంత్ మంచి ఉద్దేశంతో ఈ పాటను తెలంగాణ రాష్ట్ర గేయంగా రూపిందించే కార్యక్రమాన్ని చేపడుతున్నా తెలంగాణ పాటగాళ్లకు దీన్నెందుకు అప్పగించలేదని కొందరు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా రేవంత్ తరపున మాత్రం ఎవరూ దీనిపై స్పందించటం లేదు.

- Advertisement -

ఇటు రేవంత్ మాత్రం తన దూకుడును కొనసాగిస్తూ ఇప్పటికే కీరవాణితో వ్యక్తిగతంగా భేటీ అయి, కీరవాణి స్టూడియోకు స్వయంగా వెళ్లి, పాటను పదేపదే విని, చదివారుకూడా. అయితే ఈ పాటలో మార్పులుంటాయనే చర్చ జోరుగా సాగుతుండగా ఈ విషయాన్ని కవి అందెశ్రీ కూడా ధృవీకరించటం లేదు.

 తెలంగాణ గేయంలో స్వల్ప మార్పులు, చేర్పులు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. అందులో జిల్లాల ప్రస్తావనతోపాటు మరికొన్ని అంశాలు ఉండడంతో వాటి స్థానంలో ఏయే అంశాలు ఉండాలి అన్నదానిపై అందరూ ఆసక్తిగా చర్చిస్తూ, ఊహాగానాలు చేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. కానీ ఈ పాట రాసిన సమయంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 10 జిల్లాలు ఉండటంతో పది జిల్లాలు అన్న పదాన్ని తొలిగించినట్లు సమాచారం. అంతేకాదు  భవిష్యత్తులోనూ ఈ పాటకు ఇక ఎలాంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేట్లు ప్రస్తుతం ఉన్న గేయాన్ని మార్చినట్లు తెలుస్తోంది.

జయ జయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఇది జనంలోకి విస్తృతంగా వెళ్లి, మంచి ఊపు తెచ్చింది. కానీ ఎందుకో తెలంగాణ సిద్ధించాక, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఈ పాటను అస్సలు పట్టించుకోలేదు. ఈ గీతాన్ని పదేళ్ల క్రితం గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రజలకు అందిస్తే బాగుండేదని, కానీ గత ప్రభుత్వం ఈ పాట విషయంలో ఎన్నో తప్పులు చేసిందనే అపవాదు కేసీఆర్ మూటగట్టుకున్నారు.

ఇంతకీ జయజయహే తెలంగాణ పూర్తి పాట మీకు తెలుసా?

జయ జయహే తెలంగాణ… జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి
భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
హాలుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల
బహత్ కథల తెలంగాణ కోటిలింగాల కోణ
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన
తెలుగులో తొలి ప్రజాకవి పాల్కురికి సోమన
రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని గట్టి
కవిరాజై వెలిగె దిశల కంచర్ల గోపన్న
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
మల్లినాథసూరి మా మెతుకుసీమ కన్నబిడ్డ
ధూళికట్ట నేలినట్టి బౌద్ధానికి బంధువతడు
ధిజ్ఞాగుని కన్న నేల ధిక్కారమె జన్మహక్కు
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

పోతనదీ పురిటిగడ్డ.. రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

జానపదా జనజీవన జావళీలు జాలువార
జాతిని జాగృత పరచే గీతాల జనజాతర
వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతేనేమి
తరగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచర్ల
సర్వజ్ఞ సింగభూపాలుని బంగరు భూమి
వాణీ నా రాణీ అంటు నినదించిన కవికుల రవి
పిల్లలమఱ్ణి పినవీరభద్రుడు మాలో రుద్రుడు
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

సమ్మక్కలు సారక్కలు సర్వాయిపాపన్నలు
సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతు
ఊరూర పాటలైన మీరసాబు వీరగాథ
దండు నడిపే పాలమూరు పండుగోల్ల సాయన్న
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
డప్పూ ఢమరుకము, డక్కి, శారద స్వరనాదాలు
పల్లవులా చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ
అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి
విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక
ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మా వెలగాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువున సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పువ్వులపొద
సిరులు పండె సారమున్న మాగాణమె కదా! నీ యెద
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

గోదావరి క్రిష్ణమ్మలు మా బీళ్లకు తరలాలి.. 
పచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా వుండాలి
సకల జనుల తెలంగాణ స్వర్ణయుగం కావాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News