Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Karimnagar: బీఆర్ఎస్ ఇప్పటికే చచ్చిపోయిన పార్టీ

Karimnagar: బీఆర్ఎస్ ఇప్పటికే చచ్చిపోయిన పార్టీ

రాముని పూజిద్దాం బిజెపిని పాతాళానికి తొక్కేద్దాం

తన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కొంతకాలం తాను సొంత ప్రాంతానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని అందుకు క్షమించాలని, ప్రస్తుతం తన బాధ్యతలు మొత్తం పూర్తయినందున కొన ఊపిరి ఉన్నంత వరకు ఇక్కడే ఉంటూ ప్రజాసేవ చేసుకుంటానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల కేంద్రంలోని జివిఆర్ ఫంక్షన్ హాల్ లో శనివారం నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజేందర్ రావు మాట్లాడుతూ… తన సొంత నియోజకవర్గమైన చొప్పదండిలో కాలు మోపినప్పటి నుండి తన గుండె వేగం పెరిగిందని కాసింత ఉగ్వేదానికి గురయ్యారు. తన తండ్రి వెలిచాల జగపతిరావు తనను కరీంనగర్ ప్రజలకు సేవ చేయాలని ముందు నుంచి చెప్పుకొచ్చారన్నారు. ఇక తాను కాంగ్రెస్ పార్టీ నుండి కరీంనగర్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేస్తున్నానని తనకు అవకాశం కల్పించాలని కోరారు.

- Advertisement -

రామున్ని ఒక ప్రచార సాధకంగా చేసుకొని తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బిజెపి చూస్తుందని, బిజెపిలో ఉన్న హిందువులకే రాముడు సొంతమన్నట్లు, మిగతా వాళ్ళకి రాముడి మీద ఎలాంటి హక్కు లేనట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. ముఖ్యంగా మతకల్లోలాలు సృష్టిస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ.. అంబానీ అదానీలకు ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తున్న బిజెపిని ఈసారి ఇంటికి పంపించాలని కోరారు. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని, మరోసారి అవకాశం కల్పిస్తే దేశాన్ని చిన్నభిన్నం చేసేందుకు కూడా బిజెపి వెనకాడని విమర్శించారు. నోట్లను రద్దుచేసి అమాయక ప్రజలను అయోమయంలో పడేసిన మోడీ నల్లధనాన్ని తిరిగి వెనక్కి తెప్పించి జన్ ధన్ ఖాతాల్లో జమ చేస్తానని మోసపూరిత హామీలు ఇచ్చారన్నారు. కానీ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా వేయలేదని స్పష్టం చేశారు. ఇక 25 కోట్ల ఎంపీల్యాడ్స్ నిధుల్లో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి 20% కూడా వినియోగించ లేదని తెలిపారు. ఐదేళ్ల కాలంలో ప్రజలకు చేరువ కాలేని బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి బిజెపికి మహిళల పట్ల ఉన్న అభిప్రాయాన్ని తేటతెల్లం చేశారని ఎద్దేవా చేశారు. పొన్నం ప్రభాకర్ ఐదేళ్ల కాలంలో 850 ప్రశ్నలతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిస్తే, అప్పుడప్పుడు పార్లమెంటుకు వెళ్లిన బండి 50 ప్రశ్నలతో చివరి స్థానంలో నిలిచి తన పరువు తీసుకున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రపతి మూర్మోను నిల్చోబెట్టి కాల్ మీద కాలు వేసుకుని కూర్చున్న మోడీ గిరిజన మహిళ పట్ల తన అహంకారాన్ని చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బిజెపి పార్టీని గెలిపిస్తే రాజ్యాంగాన్ని సవరించి దేశ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తుందని ఆరోపించారు. ఇక కెసిఆర్ తనని హెలికాప్టర్లో తిప్పి ప్రచారం చేసుకొని, అన్ని విధాలుగా వాడుకొని తనపై అబాండాలు మోపి తన దొంగబుద్ధిని ప్రదర్శించారని, అప్పటి నుంచి తనకు టిఆర్ఎస్ పార్టీ అంటేనే అసహ్యమని తెలిపారు. ఇప్పటికే బి ఆర్ ఎస్ పార్టీ చచ్చిపోయిందని దాని గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా బి ఆర్ ఎస్ పార్టీ వలస పక్షులను ప్రోత్సహిస్తుందని, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అభ్యర్థిగా పోటి చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. పాంచ్ న్యాయ్ హామీలతో బరిలో దిగిన కాంగ్రెస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించి రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుందామని, స్థానిక సమస్యలపై అవగాహన, అందరి నోళ్ళల్లో మెదిలే తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ప్రసంగించగా ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అట్లూరి లక్ష్మణ్ కుమార్, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్, కురుమళ్ళ శ్రీనివాస్ కొండోలి సత్యనారాయణ ఆరేపల్లి మోహన్, నాయకులు సత్యప్రసాద్, సత్యప్రసూన, పద్మాకర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News