Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Kavitha @ Korutla: కాంగ్రెస్ ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది

Kavitha @ Korutla: కాంగ్రెస్ ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది

టూరిస్ట్ నాయకులను నమ్మొద్దు

కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు అన్ని రంగులు మార్చుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధమని స్పష్టం చేశారు. తెలంగాణను పుట్టించిందే సీఎం కేసీఆర్ అని, ఆ తర్వాత రైతు బంధు, బీడీ కార్మికులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీని పుట్టించిందే సీఎం కేసీఆర్ అని వివరించారు. నియామకాలపై, ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ వాళ్లు కేసులు వేస్తూ మళ్లీ ఏమీ తెలియనట్టు నంగనాచిలా గ్రామాల్లోకి వచ్చి సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తారని ధ్వజమెత్తారు.

- Advertisement -

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ తో కలిసి కవిత వెల్లుల్ల గ్రామంలో, ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ… “ఎన్నికలప్పుడే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వస్తారు. అందుకే ఆయనకు నేను ఎలక్షన్ గాంధీ అని పేరు పెట్టాను. ఆయన హిందీలో మొహబ్బత్ కా దుకాణ్ (ప్రేమను పంచుతాం) అని హిందీలో అంటే… ఇక్కడ హిందీ రాని రేటెంత రేవంత్ రెడ్డి రాహుల్ దుకాణ్ అంటున్నారని దుకాణం తెరిచి సీట్లన్ని అమ్ముకున్నారు. ” అని వ్యాఖ్యానించారు.

వచ్చేది సీఎం కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ బీజేపీ గెలిచినా లాభం లేదని, బీజేపీ అభ్యర్థి గెలిచినా ఒంటి కొమ్ము సొంటికాయలా ఉంటారు కానీ అధికారంలోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీతో ఒక అణాపైసా లాభం జరిగిందా అని ప్రశ్నించారు. 50 ఏళ్లుకుపైగా రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమీ చేయలేదని, మహిళలకు బీడీల గతి పట్టించిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. వాట్సప్ లో వచ్చే మెసేజీలను నమ్మవద్దని యువతకు సూచించారు. తెలంగాణ హక్కల కోసం నిరంతరం కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. మంచి రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. 1969లో తెలంగాణ కావాలని అడిగితే 369 మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చిచంపిందని, 2009 సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే తెలంగాణను కాంగ్రెస్ పార్టీ చచ్చినట్టు ఇచ్చిందని వివరించారు. మనల్ని కష్టపెట్టిన వారికి ఓటేస్తే మోసపోతామని అన్నారు.

కేసీఆర్ బీమా పథకాన్ని బీజేపీ నాయకులు అవహేళన చేస్తున్నారని, అటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. మంచి చేస్తున్నవాళ్లను కాదని ఇతరుల వైపు చూడవద్దని కోరారు. సీఎం కేసీఆర్ కంటే గొప్పగా ఆలోచన చేసేవారు, పనిచేసేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. రైతులను అవమానించే రేవంత్ రెడ్డి రైతుల గురించి ఏం ఆలోచన చేస్తారు ? అని అడిగారు. ధరణిని బంగాళా ఖాతంలో వేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారని, ధరణి తీసేస్తే రైతు బంధు రాదని, ధాన్యం కొనుగోలు డబ్బులూ రావని స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే కరెంట్ రాదని ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని, అలాంటి అపోహలను పటాపంచలు చేసి దేశంలోనే తెలంగాణను సీఎం కేసీఆర్ అగ్రగామిగా నిలిపారన్నారు. సీఎం కేసీఆర్ కష్టపడకపోతే 24 గంటల కరెంటు రాకపోతుండేనని, 24 గంటల పాటు కరెంటు వస్తుందంటే దాని వెనుక సీఎం కేసీఆర్ చెమట, రక్తం, మేధస్సు, కష్టం దాగి ఉన్న విషయాన్ని గమనించాలని కోరారు.

మూడు గంటల పాటే కరెంటు చాలని రేవంత్ రెడ్డి అంటున్నారని, ఈ నేపథ్యంలో తప్పుడు పార్టీకి ఓటేస్తే కరెంటు గుల్లవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పాలిస్తున్న కర్నాటకలో అదే పరిస్థతి నెలకుందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కష్టపడ్డారు కాబట్టి పేద ప్రజల పట్ల ఆలోచన ఉంది కాబట్టి రైతన్నల బాగు కోసం కృషి చేశారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదాన్ని సీఎం కేసీఆర్ పూర్తిగా సాకారం చూస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 73 లక్షల ఎకరాలకు నేరుగా సాగునీరు అందిస్తున్నామని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తయితే మరో 50 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని వివరించారు.

గ్రామాల్లోకి వరదలా నిధులు వస్తున్నాయని చెప్పారు. ఉద్యోగ కల్పనలోనూ తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని తెలియజేశారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయని, ఇప్పటికే లక్షా 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. రాష్ట్రానికి దాదాపు 22 వేల ప్రైవేటు కంపెనీలు వచ్చాయని, దాంతో 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News