తనకు మోడీ నోటీసు వచ్చిందని, కానీ రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని, ఆ విభాగం ఎలా చెబితే అలా ముందుకెళ్తామని తెలిపారు. గురువారం ఆమె నిజామాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ వ్యవహారంపై పెద్దగా ఆలోచించవద్దని, గత ఏడాది కాలంగా టీవీ సీరియల్ లాగా సాగదీస్తున్నారని, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్లీ ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 2జీ కేసు కూడా ఇంత కాలం సాగలేదని, కేవలం రాజకీయ దురుద్ధేశాలతోనే ఈడీ నోటీసులు పంపించిందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు.
ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నా ఇదే తీరుతో వ్యవహరించడం బిజెపి విధానమని విమర్శించారు. సీఎం కెసిఆర్ కి వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్, బిజెపి పార్టీలు భయపడుతున్నాయని, తెలంగాణలో మరో సారి కెసిఆర్ సీఎం కాబోతున్నారని తెలిపారు. దేశ ప్రజలు కూడా కెసిఆర్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పారు. కాబట్టి రకరకాల ఆరోపణలు వస్తాయని, కానీ తాము ఏ పార్టీకీ బీ టీమ్ కాదని తేల్చిచెప్పారు.