Saturday, July 6, 2024
Homeపాలిటిక్స్Karimnagar: తన స్థాయి మరచి రేవంత్ మాట్లాడుతున్నాడు

Karimnagar: తన స్థాయి మరచి రేవంత్ మాట్లాడుతున్నాడు

ప్రస్తుత పరిస్థితులను చూస్తే దుఃఖం వస్తుంది

ముఖ్యమంత్రి స్థాయి మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ కు పార్లమెంటు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే దుఃఖం వస్తుందని బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క ఎకరం పొలం అయినా ఎండిందా..? కేసీఆర్ ఉన్నప్పుడు పచ్చటి పొలాలు ఉండే.. 24 గంటల కరెంటు ఉండే.. ఇంతమాయిల్లమే అవన్నీ ఎందుకు మాయమైనయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రైతాంగంపై ప్రేమ ఉంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వచ్చేవా అని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల శంఖారావంలో భాగంగా కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కళాశాల మైదానంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన కదనభేరి భారీ బహిరంగ సభలో కెసిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

- Advertisement -


కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క ఎకరం అయినా ఎండిందా…?
కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క ఎకరం పొలం అయినా ఎండిందా…? అని కేసీఆర్ ప్రశ్నించారు. మరి ఇవాళ ఏం బీమార్ వచ్చిందని అడిగారు. ఈ బీమార్ ఇట్లనే ఉండాలా? మళ్లీ తెలంగాణ ఆత్మహత్యలు రావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. తాము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేశామని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టామని అన్నారు. ఎవరూ అడగకపోయినా, ఎవరూ ధర్నా చేయకపోయినా రైతుబంధు తీసుకొచ్చామని తెలిపారు. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతుబంధు పథకం ప్రారంభించింది తమ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. రైతుల కోసం రూ.5లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చామని.. కానీ ఇవాళ దాని గురించి ఏ వివరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసే ముందు రాష్ట్రంలోకి ఏ విధంగా పరిశ్రమలు వచ్చినయ్.. ఐటీ వచ్చింది.. రాష్ట్ర జీఎస్డీపీ పెరిగింది.. ఏ విధంగా తలసరి ఆదాయం పెరిగిందనేది ఆలోచన చేయాలని ప్రజలను కోరారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్ల పచ్చటి పొలాలు ఉండే.. ఎట్ల 24 గంటల కరెంట్ ఉండే.. ఇవాళ ఇంతమాయిల్లమే ఎట్ల మాయమైనయి.. ఎందుకు మాయమైనయ్ అనేది ఆలోచించాలని ప్రజలను కేసీఆర్ విజ్ఞప్తి చేశారు..

రెండు మూడు రోజుల్లో టీవీలో కూర్చుంటా.. కాళేశ్వరం సంగతి ఏంటో చెబుతా
ఈ అసమర్థ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాటలు చెప్పి జనాలను మాయ చేశారని కేసీఆర్ అన్నారు. రైతులకు బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారని.. మొన్న వానకాలం పంటలకు బోనస్ ఇచ్చిండ్రా, పోనీ యాసంగికి ఇస్తామని చెబుతున్నారా? అని అడిగారు. బోనస్ అనేది బోగస్ అయిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు అనేక విషయాల్లో అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారని.. ఒకేరకంగా కేసీఆర్ మీద ఏడ్చుకుంటూ పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని వంద కాంపోనెంట్లలో మేడిగడ్డ బ్యారేజి ఒక్కటని కేసీఆర్ అన్నారు. అందులో కొంత ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగితే.. ఏదో ప్రళయం బద్ధలైనట్లు, దేశమే కొట్టుకుపోయినట్టు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు మూడు రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నానని.. కాళేశ్వరం సంగతి ఏంటి? ఎందుకు కట్టినమో వివరిస్తానని అన్నారు.

దుఃఖం వస్తుంది
కరీంనగర్ జిల్లాలో నీళ్లు వచ్చినయంటే అది కాళేశ్వరం పుణ్యమే అని కేసీఆర్ అన్నారు. ఏవిధంగా మిడ్ మానేరు ఎల్ఎండీ నిండి ఉంటుండే.. చెరువులు, చెక్డ్యాంలు మత్తళ్లు దుంకుతుండే అని తమ ప్రభుత్వం సమయంలోని పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. కానీ ఇవాల్టి పరిస్థితిని చూస్తుంటే మనసుకు దుఃఖం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కండ్ల ముందే ఇంత తొందరగా కరెంటు మాయం కావడం.. రైతుల కండ్లల్ల నీళ్లు పెట్టుకోవడం చూస్తుంటే బాధైతుందని అన్నారు. అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెట్టడం, గొర్లు, గొడ్లను మేపడం వంటివి సోషల్ మీడియాలో చూస్తున్నామని చెప్పారు. రైతులు అట్ల నాశనమైతుంటే కూడా.. పేగులు మెడలేసుకుంటా.. పండబెట్టి తొక్కుతా అనే డైలాగులు తప్పితే.. రైతు సోదరులారా భయపడకండి అని ధైర్యం చెబుతున్నారా? అని మండిపడ్డారు.

ఒక్క పన్ను ఊగితే.. 32 పండ్లు రాలగొట్టుకుంటామా..?
ఒకప్పుడు ఇదే ఎస్సారెస్పీకి నీళ్లు తక్కువ పడితే.. సింగూర్ డ్యామ్ నుంచి తెచ్చి వరంగల్ దాకా పంటలు కాపాడినమని కేసీఆర్ గుర్తుచేశారు. ప్రభుత్వం అంటే అట్ల దమ్ము ధైర్యం ఉండాలని అన్నారు. రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితి రాకపోవు అని అభిప్రాయపడ్డారు. ఎంతసేపు మేడిగడ్డ.. ఈ గడ్డచూపి కేసీఆర్ను ఏమైనా బద్నాం చేయొచ్చా అనే చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మన పండ్లలో ఒక పన్ను ఒదలైతది.. ఏ పన్ను ఊగుతదో ఆ పన్ను బాగు చేసుకుంటాం. అంతేకానీ 32 పండ్లు రాలగొట్టుకుంటమా?’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 300 పైచిలుకు పిల్లర్లు ఉంటయని.. అందులో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం భారతదేశమే మునిగిపోతుందన్నట్టుగా బొబ్బ చేసి.. కేసీఆర్ మీద బద్నాం పెట్టాలనే పద్ధతిలో చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మార్చిలోనే గిట్ల ఉంటే ఏప్రిల్, మే నెలలో మన గతి ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వినోద్ కుమార్ కోరినట్లు గ్రామాల్లో చర్చ పెట్టాలని కోరారు. ఏ విషయం చూసినా కూడా ప్రభుత్వం వైఖరి సరిగ్గా లేదని మండిపడ్డారు.

బీఆర్ఎస్ అంటే అంకుశంలా ఉండాలి
ఒక అంకుశంలా బీఆర్ఎస్ ఉండాలని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ బలం.. తెలంగాణ బలమని అన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం. తెలంగాణ గళమని చెప్పారు. ‘శాసన సభలో గానీ.. పార్లమెంటులో గానీ అన్నివిధాలుగా రాష్ట్రాన్ని, కేంద్రాన్ని ఒప్పించి.. మెడలు వంచి బ్రహ్మాండంగా పనులు చేయించాలంటే బీఆర్ఎస్ ఉండాలని అన్నారు.

ఎన్నికల తర్వాత గెలిచిన వాళ్లకు మూడు నెలల దాకా వాళ్లను పనిచేయనిద్దాం.. వాళ్ల వ్యవహారం ఏంటో చూద్దాం.. వాళ్లకు అధికారం వచ్చిందనే అక్కసుతో ఉండొద్దు. నాలుగు నెలల తర్వాత కార్యాచరణ మొదలుపెడదాం అని చెప్పిన. ఎన్నికల ముందు ఇప్పుడే వెళ్లి రూ.2 లక్షల రుణం తెచ్చుకోండ్రి.. డిసెంబర్ 9వ తేదీన మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పారు. కానీ చేయలేదు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు’ అని చెప్పారు. ‘ తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలి. ప్రశ్నించేవాడు ఉండాలి. తెలంగాణ సోయి ఉన్నవాడు.. తెలంగాణ ఉద్యమం తెచ్చిన వాళ్లు.. పేగులు తెగే దాకా కోట్లాడినవాడు.. చావు అంచుదాకా వెళ్లి చావు నోట్లో తల పెట్టినోళ్లకు తెలంగాణ గురించి కడుపు నొప్పి ఉంటుంది. కాబట్టి నా మాటలను ఆలోచన చేయిండ్రి’ అంటూ యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని కోరారు.

ఈ రోజు ప్రభుత్వం నడుస్తున్న విధానాన్ని.. తాము ఉన్నప్పుడు ఎంత గౌరవంగా ప్రభుత్వం నడిచిందో తేడా చూడాలని అన్నారు. అనేక రకాల స్కీమ్లు తెచ్చి.. ప్రజలను కడుపులో పెట్టుకున్నామని చెప్పారు. కెసిఆర్ మాట్లాడుతున్నంత సేపు ప్రజలు ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News