టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ ప్రజల కష్టాలు తీరతాయని నారా భువనేశ్వరి అన్నారు. కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మహిళలతో భువనేశ్వరి మాట్లాడారు.
తమకు సరిగా నీళ్లు రావడం లేదని, అర్హత ఉన్నవారికి పెన్షన్లు ఇవ్వడం లేదని, కరెంటు బిల్లుల భారం ఎక్కువైందని భువనేశ్వరికి మహిళలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ…ఇంటింటికీ మంచినీరు రావాలన్నా, అర్హులందరికీ పెన్షన్లు రావాలన్నా, విద్యుత్ ఛార్జీలు తగ్గాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే టీడీపీ-జనసేన ప్రభుత్వం తప్పనిసరిగా అధికారంలోకి రావాలి. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో గుద్ది చంపడం, కళ్లు పీకేయడం వంటి రాక్షసపూరిత చర్యలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోంది.
మహిళలకు రక్షణ లేదు. ఆడపిల్లలకు కూడా గంజాయి అలవాటు చేసి, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. చదువు పూర్తయిన యువత నిరుద్యోగుల్లా మిగిలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి ఆ అప్పుల భారాన్ని పేదవాళ్లపై మోపుతున్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ పోవాలన్నా, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని భువనేశ్వరి అన్నారు.