కోరుట్ల నియోజకవర్గంలో బిజెపి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఓవైపు బీజేపీ హైకమాండ్ మాత్రం కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామని పదేపదే బీరాలు పలుకుతుంటే ఇక్కడ తెలంగాణాలో మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది. బిజెపి అగ్ర నేతలు పదే పదే చెబుతున్నరు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గంలో మాత్రం బిజెపి వర్గ పోరు చూస్తుంటే గెలవడం పక్కన పెడితే నాయకులు కలిసి ఉండడం కూడా లేదని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గంలోని నేతలు గ్రూపులుగా విడిపోయి ఎవరి క్యాడర్ వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ పట్టిష్టకు కృషి చేయడం మరిచిపోయి, సొంత బలాన్ని ప్రదర్శిస్తూ, కార్యకర్తలను విచ్చిన్నం చేయడం పట్ల నియోజకవర్గం వ్యాప్తంగా నాయకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు పూర్తిగా విఫలమవుతున్నారని బిజెపి ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో బిజెపి ఆశావాహులు ఎవరి ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు.
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జె ఎన్ వెంకట్ ఈసారి అతని భార్య మాజీ ఇబ్రహీంపట్నం జెడ్పిటిసి సునీత టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి సూచించారు. బీసీ బిడ్డగా, మహిళా నేతకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి తెలిపారు. కేంద్ర బొగ్గు కార్మిక సంఘం మాజీ చైర్మన్ సురభి భూమ్ రావు కుమారుడు సురభి నవీన్ గత సంవత్సర క్రితం బిజెపిలో పెద్ద ఎత్తున చేరి, టికెట్ పై ఆశలు పెట్టుకున్నాడు. నియోజకవర్గంలో తనకంటూ క్యాడర్ ను తయారు చేసుకుని, యువత అండతో ముందుకు వెళుతున్నాడు. యువకుడైన తనకే ఈసారి టికెట్ అని తన కార్యకర్తలకు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బద్దం గంగాధర్ రెడ్డి తనకున్న పూర్వ పరిచయాలతో టికెట్ నాకే వస్తుందని ఆశతో ఉన్నాడు. తమ సొంత క్యాడర్ ని తయారు చేసుకుంటూ టికెట్ నాకే అని చెబుతూ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
వీరు కాకుండా మరో కొత్త నేతకు టికెట్ వస్తుందని, కొద్ది రోజుల్లో పార్టీలో పెద్ద ఎత్తున చేరిక కార్యక్రమం పెట్టుకున్నాడని, అధిష్టానం అండతో టికెట్ హామీతో పార్టీలో చేరుతున్నాడని బీజేపీ కార్యకర్తలు చర్చించుకుంటుండటం హైలైట్. రాష్ట్ర అగ్ర నాయకత్వంతో చర్చలు పూర్తి అయ్యాయని పార్టీలో అధికారికంగా చేరే లాంఛనమే ఇక మిగిలిందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇలా సొంత పార్టీలోనే కుమ్ములాటలు ఎక్కువయ్యాయని కార్యకర్తలు వాపోతున్నారు..ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే సోయి లేని వీరు క్షేత్రస్థాయిలో పార్టీ జెండా, అజెండా మోసే కార్యకర్తలను సమన్వయం చేసుకుని, ఉత్సాహపరిచే నేతే కరువయ్యాడని పార్టీ అభిమానులు ఆందోళనలో ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సమస్యలపై కొట్లాడకుండా, ఇలా ఎవరికీ వారే ఉండటం సరికాదని కార్యకర్తలు నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా నాయకుల తీరులో మార్పు మాత్రం రావటం లేదు. అధికారంలోకి వచ్చే ఆలోచన ఎవరికీ లేదని, స్వలాభం కోసం చూస్తున్నారని, ఇకనైనా గ్రూపిజం ఆపేసి, అంతా కలిసికట్టుగా పని చేయాలనీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.