బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు మీడియాతో ఇష్టాగోష్టీగా బీఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయం వద్ద మాట్లాడారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదని కేటీఆర్ ఈ సందర్భంగా మీడియాతో భగ్గుమన్నారు. ప్రతి ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ తమ సర్కారు ఇచ్చిందన్న కేటీఆర్, ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామన్ని చెప్పుకొచ్చారు.
లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా? హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఇష్టమన్నారు. ప్రతి ఏడాది పద్దులపై తాము శ్వేత పత్రం విడుదల చేసినట్టు, రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని కాంగ్రెస్ చెబుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఏకంగా 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడని, అది ఎలా సాధ్యమంటే మాత్రం స్పష్టంగా చెప్పకుండా మాట దాటేస్తున్నాడని కేటీఆర్ విమర్శలకు దిగారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నయని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలని, ఇప్పుడుంది అసలు ఆట అంటూ తనదైన స్టైల్లో కేటీఆర్ అనటం విశేషం. రెండు లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాంధీ హామీ ఏమైంది? మొదటి మంత్రి వర్గంలోనే ఆరు గ్యారంటీ లకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఎక్కడ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్.