తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కక్షలు, హత్య రాజకీయాలు ప్రారంభమైనయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించిన కేటీఆర్, ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ మొత్తం అండగా ఉంటుందని తెలిపారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ 29న, కాంగ్రెస్ నాయకుల చేతుల్లో దారుణ హత్యకు గురైన బిఆర్ఎస్ కార్యకర్త రిటైర్డ్ ఆర్మీ జవాన్ చిక్కేపల్లి మల్లేష్ కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,లక్ష్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ శంబిపుర్ రాజు , తదితరులతో కలిసి పరామర్శించారు. వీరంతా మల్లేష్ కుటుంబానికి భరోసా ఇచ్చారు.
మల్లేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, మల్లేష్ భార్య పిల్లలు, కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యాన్ని ఇచ్చారు. మల్లేష్ పిల్లల పూర్తి బాధ్యతను పార్టీ తీసుకుంటుందని తెలిపిన కేటీఆర్, వారికి పార్టీ తరఫున ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ మల్లేష్ అహర్నిశలు పార్టీ గెలుపు కోసం పనిచేశారన్ననారు. బిఆర్ఎస్ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు రాజకీయ హత్యలు జరగలేవన్న కేటీఆర్, ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయ కక్షతో మల్లేష్ ను హత్య చేయడం జరిగిందన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ ఈ విధంగా హత్యలు చేయడం దుర్మార్గమన్నారు. ఈ రకమైన హత్యలు, హింసా సంస్కృతి మంచిది కాదని స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావుకి విజ్ఞప్తి చేశారు. మేము గతంలో పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నా, 10 ఏళ్లలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద గాని, కాంగ్రెస్ నాయకుల మీద దాడులకు తెగబడలేదని, ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదన్నారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ మాదిరే, ఈ దురదృష్ట సంస్కృతిని ప్రోత్సహించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాలని కేటీఆర్ అన్నారు.
ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఇలాంటి దుర్మార్గమైన నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మల్లేష్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతో మల్లేష్ ను హత్య చేసి దానికి భూ తగాదాల అంశాన్ని జోడించే ప్రయత్నాన్ని చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంలో ప్రభుత్వం పక్షపాతం లేకుండా విచారణ జరిపించాలని, నేరస్తులకు సంబంధించిన కాల్ రికార్డుల వంటి కీలకమైన వివరాలన్నింటిని ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో డీజీపీ స్వయంగా చొరవ తీసుకొని నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఈగ వాలిన పార్టీ మొత్తం తరలివస్తుందని, ప్రతి ఒక్క కార్యకర్తకు వారి కుటుంబాలకు అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రారంభమైన ఈ హత్య రాజకీయాలను, రాజకీయ హింస సంస్కృతిని మీడియా ప్రజల ముందు ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడితే ప్రజలు తిరగబడతారని విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలన్నారు.