బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ సమూల ప్రక్షాళన చేయనున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. గులాబీ పార్టీని గ్రామస్థాయి నుంచి పునర్వ్యవస్థీకరించనున్నట్టు కేటీఆర్ పార్టీ ఎమ్మెల్సీలకు వివరించారు. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని, జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత యాక్టివేట్ చేయనున్నట్టు ప్రకటించారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని, పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాది అంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ సంసిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుందని, అందులో శాసన మండలి పార్టీ నేతలను ఎన్నుకుంటారని ఆయన తెలిపారు. పార్టీ ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై ఈ వివరాలు వెల్లడించి, పార్టీలో కొత్త జోష్ ను నింపే ప్రయత్నం చేశారు.