ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు చినికి చినికి గాలివానలా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ, ఈడీ దర్యాలు కొనసాగిస్తోంది. మరోవైపు నిన్న ఇదే కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ సమన్లు జారీ చేయగా వాటిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చాలా సీరియస్ గా స్పందించారు. సీబీఐ, ఈడీ అధికారులపై తాను న్యాయపోరాటానికి దిగుతానని హెచ్చరించారు. అసత్య, అపద్ధపు సాక్షాలను అధికారులు కోర్టుకు సమర్పించారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే అరెస్ట్ అయినవారిని హింసిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధానిపై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యం చేసుకుని తమ పని కానిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత మందిని అదుపులోకి తీసుకున్నారు, ఎన్నో విచారణలు చేపట్టారు, దాడులు చేశారు, కానీ ఒక్క చిన్న సాక్ష్యం కూడా అధికారులు కనిపెట్టలేకపోయారని, వంద కోట్ల రూపాయల అవినీతి అంటున్నారు కనీసం ఒక్క రూపాయి అయినా చూపించగలరా అంటూ కేజ్రీవాల్ ప్రశ్నల వర్షం కురిపించారు.