Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Mahabubnagar MLC bipolls: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ పదవి కోసం 200 కోట్లు?

Mahabubnagar MLC bipolls: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ పదవి కోసం 200 కోట్లు?

బిఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ పైనే కాంగ్రెస్ ఆశలు

శాసన మండలి అంటే పెద్దల సభగా దానికంటూ ఓ ప్రత్యేకత ఉండేది. కానీ పెద్దల సభలో సభ్యత్వమంటే డబ్బున్నోడికే సాధ్యమయ్యేలా పరిస్థితులు తయారయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన ఈ సభ్యత్వం కోసం పార్టీలు అనుభవజ్ఞులు, విజ్ఞులకే టికెట్ ఇచ్చి బరిలో దించేవారు. ఇప్పుడదంతా ఏం లేదు.. జస్ట్ డబ్బుంటే చాలు టికెట్ కొనేసి, ఓట్లు కొనేసి ఎమ్మెల్సీ అయిపోవచ్చు. ఇందుకు తాజా ఉదాహరణ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికే.

- Advertisement -

క్యాంపు పాలిటిక్స్ కూడా..

కేరళ, గోవా, బెంగళూరు వంటి మహా నగరాలకు ఓటర్లైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తరలించడం, క్యాంపు రాజకీయాలు నిర్వహించడం, మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ దగ్గరుండి సపర్యలు చేయడం దీనికి పార్టీలు వంత పాడటం పలు విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ కు బిఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నిక ఛాలెంజ్ గా మారింది. మొత్తం 1,439 ఓట్లు ఉండగా ఏ ఒక్క ఓటు కూడా చేజారి పోకుండా ఇటు కాంగ్రెస్ అటు బిఆర్ఎస్ డబ్బులతో ఎరవేస్తున్నారు. డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తులను రంగంలో దింపి ఓటర్లను మచ్చిక చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మాత్రం ఒక్కో అభ్యర్ధి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేన్నారంటే ఇవెంత ఖరీదైన ఎన్నికలో, రాజకీయ ఇంకెంత ప్రతిష్టాత్మకమైనవో ఇట్టే అర్థమవుతుంది. ఖరీదైన ఈ ఎన్నికల్లో గెలువరిదైనా ఎంత భారీ మొత్తం చేతులు మారిందనేదే ఆసక్తికరంగా మారుతోంది.

నేడే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేడు జరగనుంది. ఈ ఉప ఎన్నిక సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెడ్పిటిసిలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు మొత్తం కలిపి 1,439 ఓటర్లు నమోదయి ఉన్నారు. వీరంతా క్యాంపులకు తరలిన విషయం పాఠకులకు తెలిసిందే. నేడు నేరుగా వారి వారి నాయకుల ద్వారా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయనున్నారు. మహబూబ్ నగర్, షాద్ నగర్ (ఫరూక్ నగర్) ఎంపీడీవో కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఓటర్లు ఎక్స్ ఆఫీసియో మెంబర్లు తప్ప ఎవరికి లోపలికి అనుమతి లేదు.

ఊరించే బంపర్ ఆఫర్లు..

ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని మున్సిపల్ కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు మంచి గిరాకీ దొరికింది. అందరినీ భారీ బంపర్ ఆఫర్లు ఊరించేలా ఉన్నాయి. రొట్టె విరిగి నెయ్యిలో పడినట్లు కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు అదృష్టం కలిసి వచ్చింది. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మెజార్టీ ప్రజా ప్రతినిధులు 5-7 లక్షల వరకు ప్యాకేజీ మాట్లాడుకొని ఆయా పార్టీలకు మద్దతు ఇచ్చి మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. మరికొందరైతే రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని ఓటు వేస్తామని అభ్యర్థులను మభ్యపెడుతున్నట్లు సమాచారం. డబ్బు ఎవరి వద్ద తీసుకున్నా ఓటు మాత్రం నీకే వేస్తామని ఇరువురి అభ్యర్థులను నమ్మబల్కుతున్న ఓటర్లను చూసి అభ్యర్థులు కూడా వారి తలరాతను నమ్ముకున్నారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఓటర్లు లబ్ధి పొందారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రానే వచ్చింది పారిశ్రామికవేత్తలు డబ్బున్న యువ నాయకులు ఇరు పార్టీల నుంచి రంగంలో ఉండడంతో వీరికి మరోసారి అదృష్టం కలిసి వచ్చింది. మూడు ఐదు ఏడు లక్షల వరకు స్థాయిని బట్టి కలసి వచ్చింది.

ఇంతకీ ఓటెవరికి?

కౌన్సిలర్లు, ఎంపీటీసీలు ఒక పార్టీతో కమిట్మెంట్ తీసుకొని మరోవైపు చూపులు సారించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఉప ఎన్నికలు అంటూ డబ్బుల కోసం స్థానిక ప్రజాప్రతినిధులు వెంపర్లాడుతున్నారు. పదవులు అంటే డబ్బుల పందారమే అని మరోసారి స్పష్టం అవుతుంది. ఒక్కో అభ్యర్థి 100 కోట్ల పైన ఖర్చు పెడుతుండడంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్ కలిసి దాదాపు 200 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ మరో పద్ధతిలో క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకోవటంతో డబ్బు ఏరులై పారుతోందని జిల్లాలో ఒకటే చర్చలు సాగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో డబ్బులు రెండు చోట్ల తీసుకున్న వారి పరిస్థితి ఏమిటి? వారు ఎవరికి ఓటు వేయబోతున్నారు అనేదే పెద్ద సస్పెన్స్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News