కాంగ్రెస్ లో కొత్తగా వచ్చి చేరుతున్న బీఆర్ఎస్ నేతలు అప్పుడే పార్టీలో ముసలం పుట్టిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు చేరిన పార్టీలో తామెలా కొనసాగుతామని రాజీనామాలకు తెగబడుతున్నారు కాంగ్రెస్ సీనియర్లు. ఇంతకాలం తామంతా కొట్లాడిన బీఆర్ఎస్ నేతలతోనే రోజూ రాసుకుపూసుకు తిరగటం కుదరదని, తమ ప్రత్యర్థులే తమ సొంత పార్టీలో చేరితే ఊరుకోలేమని వీరంతా తిరుగుబావుటా ఎగరేసే స్థితికి వచ్చి, ఏకంగా రాజీనామాలు చేసేస్తున్నారు.
జీవన్ రెడ్డికి మద్దతుగా రాజీనామాలు..
ఓవైపు సీనియర్ నేత జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించి తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టించగా తాజాగా వాకిటి సత్యం కూడా జీవన్ రెడ్డి బాటలో పయనిస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరికను నిరసిస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మద్దతుగా కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ పదవికి వాకిటి సత్యం రెడ్డి రాజీనామా చేశారు.
కార్యకర్తగా ఉంటా అంతే..
సాధారణ కార్యకర్తగా ఉంటానని రాజీనామా పత్రాన్ని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి పంపారు. ఈ సందర్బంగా వాకిటి సత్యం రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంజయ్ చేరిక తెలియపోవడం, ఆయన చేరిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డినీ అవమానించడమే అవుతుందనీ, పార్టీని బ్రతికించిన నాయకుడికి అగౌరవమే మిగిలిందని వాకిటి సత్యం రెడ్డి అన్నారు. చేరిక విషయంలో ప్రభుత్వ పెద్దలు పునరాలోచించాలని, పెద్దలు జీవన్ రెడ్డికీ ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం కల్పించాలని కోరారు.