జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది? పార్టీకి ఏళ్లపాటు లాయల్ గా ఉన్న సీనియర్ కేనా? లేక మూడోతరం వరకు ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రముఖ రాజకీయ కుటుంబానికా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.
మంత్రి పదవి కోసం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, గడ్డం సోదరుల మధ్య పోటీ నెలకొంది. ఇరువర్గాల మధ్య మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది కీలకంగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల్లో ప్రేంసాగర్ రావు, గడ్డం సోదరుల మధ్యే పోటీ ఉంది. ఒకవేళ మధ్యస్థంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చినా పార్టీ పెద్దల నుంచి సానుకూలత రానట్లు తెలిసింది.
ప్రేమ్ సాగర్ లాయల్టీ..
కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన ప్రేంసాగర్ రావుకు మంత్రి పదవి కోసం పార్టీలోని ఓ వర్గం పట్టుపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు 23 జిల్లా పరిషత్ పాలకవర్గాలను ఆ పార్టీనే కైవసం చేసుకుంది. అప్పట్లో ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ ఎన్నికైన రమేష్ రాథోడ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి కౌటాల జడ్పీటీసీ సభ్యుడు సిడాం గణపతిని జడ్పీ ఛైర్మన్ గా చేసి కాంగ్రెస్ ఖాతాలో వేయటం కోసం అప్పటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్ ఉన్న ప్రేంసాగర్ రావు కృషి చేశారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా కాంగ్రెస్ ను వీడకపోవడం ఆయనకు కలసివస్తోంది.
ఢిల్లీలో మంత్రాంగం..
దిల్లీ స్థాయిలో మంత్రాంగం నడుపుతున్న గడ్డం సోదరుల ప్రాధాన్యాన్ని సైతం అధిష్టానం దృష్టిలో పెట్టుకుంటోంది. వేరే పార్టీల్లోకి వెళ్లి తిరిగి సొంత గూటికి చేరినా శాసనసభ ఎన్నికల్లో ఒకరికి చెన్నూరు, మరొకరికి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో వివేక్ తనయుడు వంశీకృష్ణకు ఎంపీ టికెట్ ఇచ్చిన అంశం చర్చకు వస్తోంది. దాంతో వారికి మళ్లీ మంత్రి పదవి ఇవ్వాలనడాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తోంది.
వీళ్ల పరిధి ఎంత?
వివేక్ సోదరులిద్దరి ప్రభావం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఉంటే, ప్రేంసాగర్ రావు ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఉంటుందనే భావన పార్టీలో ఉంది. ఇటీవల ఉమ్మడి జిల్లా ఎన్నికల బాధ్యతలకు ప్రేంసాగర్ రావు లాంటి వ్యక్తులు దూరంగా ఉండటంతోనే శ్రేణులను ఏకతాటిపై నడిపించటంలో కొంత సమన్వయ లోపం తలెత్తినట్లు పార్టీ అంతర్గత సమీక్షలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో పార్టీ పట్టు సాధించాలంటే ఏం చేయాలనే దానిపై అధిష్ఠానం అన్ని కోణాల్లో ఆరా తీస్తోంది. జిల్లా, నియోజకవర్గం, మండలాల స్థాయిల్లో పార్టీ కోసం అంకిత భావంతో పని చేసే వారికి వెన్నుదన్నుగా నిలవాలని భావిస్తోంది. అందరిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే నేతలు ఎవరనే దానిపై అంతర్గతంగా అభిప్రాయ సేకరణ చేస్తోంది.
కానీ ఒకవేళ ప్రేమ్ సాగర్ కు మంత్రి పదవి దక్కకపోతే గాంధీభవన్ సీనియర్లు-లాయలిస్టులకు ఇచ్చే సందేశం ఏంటి అనే రచ్చ రాజుకోవటం ఖాయమని జిల్లాలో జోరుగా చర్చించుకుంటున్నారు.