మరికొద్ది నెలల్లోనే మంథని నియోజక వర్గ రూపు రేఖలు మారుతాయన్న టాక్ ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. సిద్దిపేటను తలదన్నే విధంగా శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని మంథని నియోజకవర్గ ప్రజలు సంబరపడుతున్నారు. మారుమూల అటవీ ప్రాంతంగా పేరొందిన మంథని నియోజకవర్గం గతంలో కొంత అభివృద్ధి జరిగినప్పటికీ, ప్రస్తుతం గతాన్ని తలదన్నే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మంత్రి శ్రీధర్ బాబు కంకణం కట్టుకొని ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు సమాచారం.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీధర్ బాబు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలు పూర్తిగా వినియోగించుకుని మంథని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ఊహించని విధంగా చేపట్టి, పారిశ్రామికంగా కూడా మంథని నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే విధంగా తగిన వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
మంథని నియోజకవర్గంలో సింగరేణి గనులతో పాటు గోదావరి జలాలు పర్యావరణానికి సంబంధించిన దట్టమైన అడవులు మంథని నియోజక వర్గానికి ప్రత్యేకమని చెప్పవచ్చు తన గెలుపులో ప్రతిసారి ప్రధాన భూమికను పోషించే కాటారం మండలంలో ఒక భారీ పరిశ్రమ నెలకొల్పేందుకు శ్రీధర్ బాబు సమాలోచనలు సాగిస్తున్నట్లు సమాచారం. శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాద రావు 1983, 1985, 1989లలో వరుసగా మూడు పర్యాయాలు మంథని నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ స్పీకర్ గా పని చేశారు. ఆయన మరణానంతరం రాజకీయాల్లోకి తండ్రి వారసత్వంగా వచ్చిన శ్రీధర్ బాబు 1999, 2004, 2009, 2018, 2023 లలో ఐదుసార్లు విజయం సాధించడం విశేషం.
రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో, రోశయ్య ప్రభుత్వంలో, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో గతంలో మంత్రిగా పనిచేసిన శ్రీధర్ బాబు ప్రస్తుతం నూతనంగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ కీలక మంత్రిత్వ శాఖలు అని చేపట్టారు. తండ్రిని మూడుసార్లు ఆశీర్వదించిన ప్రజలు శ్రీధర్ బాబును ఐదుసార్లు మంథని నుండి శాసనసభకు పంపించారు. 1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో శ్రీపాదరావు ఓటమి చెందగా, 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో శ్రీధర్ బాబు ఓటమి చవిచూశారు. అయినప్పటికీ ఆయన నియోజకవర్గ ప్రజలతో మమేకమై తిరిగి ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో విజయం సాధించారు. తన కుటుంబానికి ఎనిమిది పర్యాయాలు శాసనసభకు పంపించిన మంథని నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న దృఢ సంకల్పంతో మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధి, పారిశ్రామిక అంశాలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. పొడవైన విస్తీర్ణంగల మంథని నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలు ఎంతవరకు ప్రజలకు చేరువైతాయో చూడాలి మరి