రాబోయే ఎన్నికలలో తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీలోకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నామంటూ.. నా గెలుపు మీ గెలుపే .. మీ గెలుపే నా గెలుపు .. అది వనపర్తి నియోజకవర్గ గెలుపని మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. నాకున్న పని ఒకటే .. ఈ నియోజకవర్గానికి ఏం తేవాలి .. ఎలా అభివృద్ధి చేయాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారాయంటూ ఆయన ప్రసంగం ఆసక్తిగా సాగింది. ఒకప్పుడు గ్రామాలు, పట్టణాలలో అన్ని మట్టి ఇండ్లు మాత్రమే ఉండేవి, ప్రస్తుతం ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ ఇండ్లు లేవు .. అధునాతన ఇండ్లు నిర్మాణమయ్యాయని, ఇది తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన స్పష్టమయిన మార్పని మంత్రి వివరించారు.
ఒకసారి మార్పు మొదలయ్యాక దాన్ని ఎవరూ ఆపలేరు .. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నది అదేనన్న ఆయన, కేవలం 9 ఏళ్లలో తెలంగాణ దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిందన్నారు. వనపర్తి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. సగర సంఘం జిల్లా అధ్యక్షులు తిరుపతయ్య సాగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరిన 350 మందికి ఆయన స్వాగతం పలికారు.