హోటల్ రంగంలోకి ఓయో(OYO) వచ్చాక కీలక మార్పులు సంభవించాయి. గతంలో అబ్బాయి-అమ్మాయి ఎవరైనా సరే మేజర్ అయితే చాలు ఆధార్ కార్డు చూపిస్తే రూమ్ కేటయించేవారు. దీంతో లవర్స్‌తో పాటు వివాహేతర సంబంధాలు నడిపే వారికి ఓయో రూమ్స్ బాగా పనికొచ్చేవి. అయితే కొత్త సంవత్సరంలో ఇలాంటి వారికి ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఓయో కంపెనీ కొత్తగా చెక్-ఇన్ పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై పెళ్లికాని జంటలు రూమ్ బుక్ చేసుకునేందుకు వీలుండదు.
కొత్త చెక్-ఇన్ పాలసీ ఆధారంగా.. ఇక నుంచి ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో రూమ్ బుకింగ్ సమయంలో పెళ్లికి సంబంధించిన రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన రుజువు సరిగా లేకపోతే బుకింగ్‌లను తిరస్కరించే విచక్షణాధికారాన్ని ఓయో తన భాగస్వామి హోటళ్లకు అందించింది. తొలుత ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్ నుంచి ఈ నిబంధనలు తీసుకొచ్చింది. తక్షణమే ఆ నగరంలోని హోటళ్లలో ఈ నిబంధనను అమల్లోకి తీసుకురావాలని నిర్దేశించింది. ఇక్కడి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించనుంది. కస్టమర్ల విశ్వాసం పెరిగి, బుకింగ్లు పెరిగేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కాగా వ్యాలిడ్ ప్రూఫ్‌గా ఏయే పత్రాలు చూపించాలనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.