Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Padi Kaushik: ప్రజాసేవకే నా జీవితం అంకితం

Padi Kaushik: ప్రజాసేవకే నా జీవితం అంకితం

నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు

ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రూ, 1000 కోట్లతో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని, ఏడుసార్లు ఒక్కరికి అవకాశం ఇచ్చారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ రెండేళ్లలో నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచే ప్రసక్తే లేదు. 15 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటున్న నియోజకవర్గ ప్రజలే నా బలం బలగం. వారి కష్టసుఖాల్లో ఒక కుటుంబ సభ్యుడిలగా తోడుంటున్న. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఒక అవకాశం కల్పించాలని హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి గురువారం తెలుగు ప్రభ ప్రతినిధితో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
✍️ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తున్నారు……..
నాకు గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. 2018 లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 60,000 పైచిలుకు ఓట్లు సాధించాను. ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలకు, అభివృద్ధికి ఆకర్షితుడునై బీఆర్ఎస్ లో చేరాను. ప్రత్యర్థులను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి బలమైన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి లేని కేడర్ ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా లక్షా 50 వేల మంది లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఇంటింటికి లబ్ధిదారులు ఉన్నారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు దళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలా పలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉన్నారు. 18 వేలకు పైగా దళిత బంధు లబ్ధిదారులు ఉన్నారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ముందుకు వెళుతున్నాను.

- Advertisement -

✍️ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు………….. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో సమానం అని చెప్పుకున్న ఈటల సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని హుజురాబాద్ లో ఎందుకు చేయలేకపోయాడని ప్రజలు గమనించాలి. ఈటలకు వ్యక్తిగత స్వలాభమే తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై ఏనాడు దృష్టి సారించలేదు. ఉప ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి స్థానికంగా ఉండడం లేదు. ఈ సారి ఎన్నికల్లో హుజురాబాద్ తో పాటు గజ్వేల్ లో సైతం పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు ఓటేసిన ప్రయోజనం ఉండదని నియోజకవర్గ ప్రజలు నిర్ణయానికి వచ్చారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. ఆ పార్టీకి ఉప ఎన్నికలు డిపాజిట్ కూడా దక్కలేదు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీపై నియోజకవర్గ ప్రజలకు విశ్వాసం లేదు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి గెలిచే అవకాశం అసలే లేదు. నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలు పాలు పంచుకుంటున్న నాకు ప్రజల నుండి సంపూర్ణ మద్దతు ఉంది. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో హుజురాబాద్ లో గులాబీ జెండా ఎగరవేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇస్తాను.
✍️ నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి ఏమిటి……….
ముఖ్యమంత్రి కేసీఆర్ కు హుజురాబాద్ నియోజకవర్గం అంటే ప్రత్యేక అభిమానం ఉంది. అందులో భాగంగానే రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతుబంధు పథకాన్ని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలోనే ప్రారంభించారు. జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను సకల సౌకర్యాలతో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. రైతుబంధు పథకం కింద హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకు రూ,523 కోట్ల 75 లక్షలను పెట్టుబడి సాయం కింద అందించడం జరిగింది. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ రైతులకు విద్యుత్ కష్టాలు తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే. నియోజకవర్గ పరిధిలో 34 వేల వ్యవసాయ విద్యుత్ మీటర్లు ఉండగా ఇప్పటి వరకు రూ,840 కోట్ల సబ్సిడీ చెల్లించడం జరిగింది. రూ,540 కోట్లతో విద్యుత్తు లైన్లకు మరమ్మతులు చేపట్టడం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. రూ,70 వేల కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఒక లక్ష 15 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. వివిధ కారణాలతో 840 మంది రైతులు చనిపోగా వారికి రైతు బీమా పథకంలో రూ,42 కోట్లు చెల్లించడం జరిగింది. హుజురాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో పదివేల మందికి రూ,88 కోట్ల ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో 44 వేల మందికి పలు రకాల ఆసరా పింఛన్లు నెలకు రూ,10 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. సుమారు 150 కోట్లతో మిషన్ కాకతీయలో నియోజకవర్గ పరిధిలోని చెరువులు, కుంటలలో పునరుద్ధరణ పనులను చేపట్టడం జరిగింది.


✍️ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది……..
బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో గ్రామాల్లోని ప్రజల వద్దకు ప్రచారానికి వెళితే అడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ఏ గ్రామానికి వెళ్ళిన వందల సంఖ్యలో ప్రజలు హాజరవుతూ ఆశీర్వదిస్తున్నారు. ప్రజల ఆదరణ చూస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పై వారికి ఎంత విశ్వాసం ఉందో అర్థం అవుతుంది. బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. దీంతో బిజెపి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇటీవల జమ్మికుంటలో నిర్వహించిన మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలకు ఊహించని స్థాయిలో ప్రజలు హాజరై నన్ను నిండు మనసుతో ఆశీర్వదించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడి వారు అక్కడే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్న సమయంలో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. అడగందే అమ్మయినా అన్నం పెట్టదని అంటారు. కానీ కేసీఆర్ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ చేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు చెబుతుండడం చూస్తుంటే గెలుపుపై ధీమా రెట్టింపు అవుతుంది.
✍️ ఎన్నికల్లో మీరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే హామీలు ఏమిటి…….
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది. ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూనే నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇస్తున్నాను. హుజురాబాద్ ను మరో సిద్ధిపేట లాగా మారుస్తా, హుజురాబాద్ లో మినీ కలెక్టరేట్ నిర్మించి ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలను అన్నింటిని ఒక చోటికి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకువస్తా. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్, శనిగరం, వావిలాల, చల్లూర్ గ్రామాలను మండలాలుగా కమలాపూర్ ను మున్సిపాలిటీగా ఏర్పాటుకు కృషి చేస్తా. ప్రభుత్వ విద్యాలయాలు, ఐటిఐ, పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాలలను తీసుకొస్తా. హుజురాబాద్ జమ్మికుంటను ట్విన్ టౌన్ లుగా అభివృద్ధి చేస్తా. పరిశ్రమల స్థాపనకు కృషి చేసి యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తా. కల్వల ప్రాజెక్ట్ ను రూ,17 కోట్లతో మినీ ఎల్ఎండిగా తీర్చిదిద్దుతా. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మినీ యాదాద్రి తరహాలో టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తా. జమ్మికుంట నాయిని చెరువు, హుజురాబాద్ మోడల్ చెరువులను పర్యాటక కేంద్రాలుగా చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తా. హుజురాబాద్ జమ్మికుంటల ఔటర్ రింగ్ రోడ్డుకు నిర్మాణానికి దృష్టి సారిస్తా. జమ్మికుంటలో వంద పడకల ఆసుపత్రి, మినీ స్టేడియం ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి సారిస్తా.

✍️ ఎన్నికల ప్రచారంలో మీ కుటుంబ సభ్యుల పాత్ర ఏ మేరకు ఉందని భావిస్తున్నారు……..
ఎన్నికల ప్రచారంలో నాతో పాటు నా సతీమణి శాలిని రెడ్డి కూడా చురుగ్గా
పాల్గొంటుంది. ఇటీవల నా కూతురు శ్రీనికారెడ్డి సైతం ఎన్నికల ప్రచారం లో పాల్గొంటూ నాకు ప్రజాసేవపై ఉన్న ఆసక్తిని వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 15 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలందరినీ నా కుటుంబ సభ్యులుగా భావించి అనునిత్యం వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటుండడంతో ప్రజల నుండి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తుంది. నాకు ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే గెలిపిస్తే నేను చేపట్టబోయే అభివృద్ధి పనులలో తాను కూడా భాగం పంచుకుంటానని నా సతీమణి శాలిని రెడ్డి చెప్తుండడంతో ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News