మూడవ తేదీన ఫలితాల రోజున విజయం సాధించేది భారత రాష్ట్ర సమితినంటూ కేటీఆర్ ప్రెస్ మీట్లో చెప్పారు. గత మూడున్నర నెలలుగా ఎన్నికల కోసం పనిచేసిన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన ఆయన.. ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసేందుకు పనిచేసిన ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి, అధికారికి ధన్యవాదాలు అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న దానితో సంబంధం లేకుండా మా విజయం పైన పూర్తి ధీమాగా ఉన్నామని, 2018లో కూడా కేవలం ఒక్క ఏజెన్సీ మినహా మిగిలినవి అన్నీ తప్పుడు ఫలితాలను సూచించాయన్నారు.
తెలంగాణ ప్రజలను ఎగ్జిట్ పోల్స్ తో అయోమయానికి గురిచేయాలని చేసిన ప్రయత్నం ఫలించదని, ఎగ్జిట్ పోల్స్ ని తప్పు అని నిరూపించడం మా పార్టీకి కొత్త కాదని, అసలైన ఫలితం మూడవ తేదీన వస్తుందన్నారు. 70కి పైగా స్థానాలతో మా పార్టీ విజయం సాధిస్తుంది, మా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ని చూసి కార్యకర్తలు నాయకులు అయోమయానికి గురికావాల్సిన అవసరం లేదని, ప్రజలు ఎన్నికల క్యూ లైన్ లో ఉన్నప్పుడు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వారివి ప్రభావితం అయ్యేలా నిర్ణయం తీసుకోవడంపై ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిఈఓతో మాట్లాడితే ఎన్నికల కమిషన్ నిబంధనలు అలాగే ఉన్నాయని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న నిబంధనలను మారిస్తే బాగుంటుందన్నారు కేటీఆర్. భవిష్యత్తులో ఆయన ఈ అంశం పైన దృష్టి పెట్టాలన్నారు. తమ ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలితే తెలంగాణ ప్రజలకు మూడవ తేదీన క్షమాపణ చెప్పాలన్నారు. ఎవరు అయోమయానికి గురికావలసిన అవసరం లేదు కచ్చితంగా అధికారంలోకి వస్తున్నామన్నారు. దుష్ప్రచారాలు, అబద్ధాలు, నకిలీ వీడియోలతో ప్రజలను ప్రభావితం చేసేలా పని చేస్తున్న పార్టీలపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడంపై ఆలోచించాలన్నారు కేటీఆర్.