జనసేన అధినేత చేయ తలపెట్టిన యాత్ర కోసం ప్రత్యేకంగా చేయించిన బస్సు రంగు.. ఏపీలో రాజకీయ రగడను రాజేసింది. ఈ రంగుపై నిన్నటి నుండి వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ.. అన్ని తెలుసని చెప్పుకునే మేధావి పవన్ కు ఈ విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. దాంతో పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. టిక్కెట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు వంటి చిల్లర పనులు ఆపి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వైసీపీ నేతలకు రకరకాల పోస్టులతో చెప్పారు.
వైసీపీ నేతల లంచ దాహానికి రాష్ట్రం నుండి ఇప్పటికే కారు, కట్ డ్రాయర్ కంపెనీల వరకూ పక్క రాష్ట్రానికి తరలిపోయాయని విమర్శించారు. ప్రజలకోసం, ప్రజల తరపున పోరాడుతున్నవారిని చూసి అసూయతో రగిలిపోతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ రోజురోజుకీ కుళ్లిపోతోందన్నారు. “ఈర్ష్యతో బాధపడే విద్యార్థులు ఇతరుల వస్తువులను నాశనం చేసినప్పుడు మా స్కూల్ టీచర్ ఒక సూక్తిని పదేపదే చెప్పేవారు. హృదయంలో శాంతి ఉంటే ఆ దేహానికి ఆయుష్షు పెరుగుతుంది. కానీ హృదయంలో కుళ్లు కుతంత్రాలు ఉంటే వారి ఎముకలు కుళ్లిపోతాయి అని చెప్పేవారు” అని పవన్ ట్వీట్లో పేర్కొన్నారు.
ప్రముఖ వాణిజ్య ప్రకటన.. ఒనిడా టీవీ యాడ్ ను ప్రస్తావిస్తూ.. పొరుగువాడికి కడుపుమంట, యజమానికి గర్వకారణం అంటూ సాగే ఒనిడా యాడ్ పిక్ ను పంచుకుంటూ.. ఈ యాడ్ నాకు చాలా ఇష్టం అని వెల్లడించారు. మరో ట్వీట్ లో ఆలివ్ గ్రీన్ రంగులో ఉన్న ఓ కారు, బైక్ ఫొటోలను షేర్ చేసి.. నియమ, నిబంధనలు కేవలం పవన్ కల్యాణ్ కోసమే అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇలా పవన్ చేసిన ట్వీట్లకు వేలల్లో లైకులు, రీ ట్వీట్లు.. కామెంట్లు హోరెత్తుతున్నాయి.