సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం.కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలన్న టెక్నికల్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది. దీంతో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ను కొత్తగా నిర్మించేదుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నిర్మాణానికి నీతి ఆయోగ్ లో ప్రతిపాదనలు పంపేలా ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేయనుంది.
ఈ నెల 27వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రం వాల్ నిర్మాణంపై ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు పెట్టనుండగా ఇందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తప్పనిసరి కావటంతో ఈ మేరకు పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని ఆమోదం తెలిపింది కేబినెట్ సమావేశం. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు అంశాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం విశేషం.
ఈ విషయాన్ని తన చేతల్లో ఎప్పటికప్పుడు చెబుతున్న సీఎం చంద్రబాబు ఈమేరకు ఏపీలో ప్రభుత్వం ఏర్పడగానే పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. ఇప్పటివరకు జరిగిన పనులు.. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పరిస్థితిపై ఆయన నిపుణులతో స్వయంగా చర్చించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేశారు.