దేశంలో.. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలతోనే కాంగ్రెస్ పోరాటం ఉంటుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. నర్సంపేట, వరంగల్ లలో శుక్రవారం రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చిందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్ని లక్షల కోట్లు అవినీతి చేశారో అంత డబ్బును పేదల అకౌంట్లో వేస్తామని తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో తానే స్వయంగా వెళ్లి చూశానని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లను దోచుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో 24 గంటల కరెంటు కేవలం కేసీఆర్ ఇంట్లో మాత్రమే వస్తుందని, రైతులకు లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కెసిఆర్ కు తెలుసునని, ఆయన చదివిన స్కూల్, నడిచే రోడ్డు కూడా కాంగ్రెస్ పార్టీ వేసిందే అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ 500 కి ఇవ్వబోతున్నామని.. ప్రతి నెల మహిళల అకౌంట్లో నెలకు 2,500 వేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని, కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. తెలంగాణలో కుల గణనను జరిపిస్తామని, స్థానిక సంస్థల్లోనూ బీసీల రిజర్వేషన్లు పెంచి న్యాయం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ అంటే కుటుంబ పాలన కాదు అని ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు.
ధరణి పేరుతో రైతులు మోసపోయారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వారి భూములను వారికి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. బి, బిజెపి, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటేనని.. వారు కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడానికి కుట్రలు చేస్తారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉచిత కరెంటును తీసుకువచ్చిందని గుర్తు చేశారు. త్వరలోనే రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తును సరఫరా చేయబోతున్నామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో దొరల ప్రభుత్వం పోయి ప్రజల తెలంగాణ రాబోతున్నదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశాలలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి, కొండ మురళీధర్ రావు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.