శోభా యాత్రలు, సంత్ సమ్మేళనాలు, రవిదాస్ జయంతి అంటూ దళితులను ఆకట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహం సిద్ధంచేసింది. సంత్ రవిదాస్ మందిరాలు ఎక్కడున్నా బీజేపీ నేతలు, కార్యకర్తలు తరచు అక్కడికి వెళ్లి పలు కార్యక్రమాలు చేపట్టాలంటూ బీజేపీ నేషనల్ ఎగ్జిక్యుటివ్ భేటీలో ప్రధాని మోడీ ఆదేశించారు.
ప్రధాని సూచన మేరకు రవిదాస్ కు సంబంధించిన పలు కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ, దళిత ఓటర్లను ఆకట్టుకునే పనిలో బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు. అగ్ర వర్ణ పార్టీగా బీజేపీకి ఉన్న ముద్రను తుడిచి వేయటంలో భాగమే ఇదంతా. అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా హరిజన, గిరిజన, మైనారిటీలను ఆకట్టుకుంటే హ్యాట్రిక్ కొట్టడం సులువు అవుతుందన్న ప్రత్యేక వ్యూహ రచనలో ఉన్న పార్టీ ఈమేరకు దేశవ్యాప్తంగా సంత్ రవిదాస్ పేరుతో పలు కార్యక్రమాలు రూపొందిస్తోంది.
భక్తి ఉద్యమంలో సంత్ రవిదాస్ కీలక పాత్ర పోషించారు. 15-16 శతాబ్దంలోని కవిగా, కులతత్వంపై పోరాడిన రవిదాస్ జయంతి కార్యక్రమాలను బీజేపీ అధికారికంగా నిర్వహించనుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్నాటక, మధ్యప్రదేశ్ లో ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సాగనున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన రవిదాస్ జయంతి. ఈనెల 5వ తేదీన దళిత కుటుంబాలను కలవటం, దళితులతో కలిసి శోభాయాత్రలు, సంత్ సమాగమాలు నిర్వహించనున్నారు కమలనాథులు.
నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో రవిదాస్ జయంతి రోజున ‘వికాస్ యాత్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఎన్నికల ప్రచార హోరును ప్రారంభించనున్నారు. దళితుడైన రవిదాసు గౌరవార్థం రవిదాస్ మహాకుంభ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఈమేరకు బీజేపీ షెడ్యూల్ క్యాస్ట్ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యా ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయికూడా. 2011 సెన్సెస్ ప్రకారం కర్నాటక, మధ్యప్రదేశ్ లో దళితుల ఓట్ల శాతం 16-17 శాతం వరకు ఉన్నాయి.