సీఎం రేవంత్ రెడ్డి నయా స్ట్రాటెజీని అనుసరిస్తూ యూత్ కాంగ్రెస్ పై సరికొత్త సవారీ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడూ హుషారుగా, యంగ్ అండ్ డైనమిక్ గా కనిపించే రేవంత్ రెడ్డికి యూత్ లో మంచి ఫాలోయింగ్ మాత్రమే కాదు, క్రేజ్ కూడా ఉంది. అందుకే రేవంత్ ఏకంగా యూత్ కాంగ్రెస్ ను మంచి, బలమైన అస్త్రంగా మార్చుకునే పనిలో నయా స్ట్రాటెజీ సిద్ధం చేశారు. ఇందుకు తగ్గట్టుగా యూత్ కాంగ్రెస్ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, ఈ విభాగానికి మరింత జవసత్వాలు నింపుతున్నారు.
తెలంగాణ యూత్ కాంగ్రెస్ స్టేట్ ఎగ్జిక్యుటివ్ మీటింగ్..
తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇప్పటి వరకు కేవలం నామమాత్రంగా మాత్రమే ఉండేది. పెద్దగా యాక్టివిటీస్ అంటూ ఏమీ లేకపోయినా జస్ట్ నామ్ కే వాస్తే అన్నట్టు వ్యవహారాలన్నీ తూతూ మంత్రంగా సాగేవి. కానీ రేవంత్ మాత్రం యూత్ కాంగ్రెస్ ఇంటర్నల్ సమావేశాలు గట్టిగా జరిగేలా చూస్తున్నారు. ఇప్పటి వరకు యూత్ కాంగ్రెస్కు సారథ్యం వహించిన బల్మూరి వెంకట్ కు ఎమ్మెల్సీ దక్కటంలో రేవంత్ వ్యూహం చాలా పదునైననదని ఇప్పుడుగానీ అందరికీ అర్థం కావటం లేదు. యూత్ కాంగ్రెస్ లో ఉంటే తమకు కూడా అతి తక్కువ సమయంలో సక్సెస్ తో పాటు గుర్తింపు వస్తుందనే విశ్వాసాన్ని కల్పిస్తూ యూత్ కాంగ్రెస్ లో పొలిటికల్ జోష్ నింపుతున్నారు.
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనా రెడ్డి అధ్యక్షతన తెలంగాణ యూత్ కాంగ్రెస్ సమావేశంలో 2024 పార్లమెంట్ ఎన్నికలలో యూత్ కాంగ్రెస్ ప్రణాళికపై లోతైన చర్చ జరిపారు. యూత్ కాంగ్రెస్ డోర్ టు డోర్ ప్రచారంపై చర్చించి రివ్యూ చేయించారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై జవాన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. తొందర్లో యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీలను వేస్తామని కూడా భరోసా ఇచ్చారు.
2024 పార్లమెంట్ ఎన్నికలో 15 ఎంపీ స్థానాలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం…
ఏఐసీసీ జాయింట్ సెక్రెటరీ, యూత్ కాంగ్రెస్ జాతీయ ఇంచార్జ్ కృష్ణ అల్లవారు తాజాగా జరిగిన యూత్ కాంగ్రెస్ భేటీలో పాల్గొని దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులకు రేవంత్ స్వయంగా పలుసార్లు గైడ్ చేస్తున్నారు. యూత్ కాంగ్రెస్ బలోపేతమైతే ఇక కాంగ్రెస్ కు మరో దశాబ్దంపాటు ఢోకా ఉండదనే భారీ వ్యూహం ఇందులో దాగి ఉంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో యువత ఓట్లు చాలా కీలకం కానుండగా, ఫస్ట్ టైం ఓటర్స్, చదువుకున్న యువతను ఆకట్టుకునేలా రేవంత్ యూత్ కాంగ్రెస్ ను తీర్చిదిద్దుతుండటం విశేషం. దూకుడును ఇష్టపడే యువతకు నచ్చేలా యూత్ కాంగ్రెస్ ను మరింత దూకుడుగా తయారు చేస్తూ యువ ఓటర్లకు రేవంత్ గాలం వేస్తున్నారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.