ఈనెల 17వ తేదీన సాయంత్రం 5గంటలకు విజయభేరీ సభని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. సభ వేదిక స్థలం వద్ద సోమవారం టీబీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇంచార్జ్ మణికరావు కాక్రే మధుయాష్ గౌడ్ తదితరులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ఈ సభకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. ఇదివరకే రేవంత్ రెడ్డి ఆయా సమావేశాల్లో నేతలకు దిశానిర్దేశం చేశారని పేర్కోన్నారు. నేటి నుంచి అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
119 శాసనసభ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించుకుంటున్నారని రాష్ట్రంలోని 35వేల బూత్‌ల నుంచి సభకు కార్యకర్తలు తరలి వస్తున్నారని వివరించారు. రాబోయే మూడు రోజుల పాటు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సమీక్షలు చేస్తారనీ జిల్లా పార్టీ అధ్యక్షులు వారితో సమన్వయం చేసుకుంటారని చెప్పారు. 17వ తేదీన రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయభేరీ సభలో సోనియాగాంధీ 5 గ్యారంటీ హామీలను విడుదల చేస్తారనీ,18వ తేదీన ఉదయం 11 గంటలకు 119 నియోజకవర్గాలకు జాతీయ నాయకులు చేరుకుంటారనీ,18వ తేదీన వారితో కలిసి 5గ్యారంటీలకు సంబంధించి పోస్టర్లను అతికించాలని ఇంటింటికీ గ్యారంటీ కార్డులను అందజేయాలని కార్యకర్తలతో భోజనాలు చేయాలనీ, ఆ తర్వాత సమావేశాలు నిర్వహించి 5 గ్యారంటీ హామీలను వివరించాలని కోరారు. 18వ తేదీన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతీ ఒక్కరు సమన్వయం చేసుకుని సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలి’’ అని వీర్లపల్లి శంకర్ తెలిపారు.