తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ అటు సూర్యుడు ఇటు ఉదయించిన భూమి బద్దలైన కానీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ని ఆగస్టు 15 లోపు చేసి చూపిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. మడికొండలో ఎంపీగా కడియం కావ్య గెలుపు కోరుతూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జన జాతర బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
సభలో మోడీ, కెసిఆర్, హరీష్ రావులపై రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. రైతు రుణమాఫీ చేస్తే హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కూడా నిలబడనని వాగ్దానం చేస్తూ సవాల్ విసిరాడని.. అందుకు నేను సమాధానం చెబుతున్న బిడ్డ ..రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని రెడీగా ఉండు.. కచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. హరీష్ రావు.. కేసీఆర్ మాదిరిగా మాట తప్పవద్దని సూచించారు.
మోడీ కేసీఆర్ తోడు దొంగలని పదేళ్లపాటు దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేశారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇకనైనా మేలుకొని వారి మోసాల నుండి బయటపడి కాంగ్రెస్ కు పట్టం కట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ మెదడు కరిగించి కాలేశ్వరం కట్టామని చెబుతున్నారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టి కట్టిన కాలేశ్వరం కూలిపోయింది. మేడిగడ్డ మేడిపండులా మారిపోయింది. అన్నారం బ్యారేజ్ ఆకాశంలో కలిసిపోయిందని, అదే కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల్లో లోపాలు లేవని, నాగార్జునసాగర్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నదని తెలిపారు. అసెంబ్లీకి రాణి కేసీఆర్ టీవీ9 షోలో గంటలపాటు కూర్చుని బాతకాని కొట్టారు గానీ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇద్దామనే సోయి లేదని దుయ్యబట్టారు. మామ అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరి పడుతున్నారని చురకలాంటించారు. ఆరూరి రమేష్ కు ఓటేస్తే భూములను మింగేస్తాడని ఆరోపించారు.
వరంగల్ నగరానికి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని, టెక్స్టైల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పద్మశాలి సోదరులకు అండగా నిలబడతామని తెలిపారు. అండర్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు తో పాటు ఎయిర్పోర్ట్ సౌకర్యాన్ని కూడా కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. త్వరలోనే కాకతీయ యూనివర్సిటీని ప్రక్షాళన చేసి, కొత్త వీసీని నియమిస్తామని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం నుండి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని కడియం కావ్యం భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభిలషించారు.
సభలో మంత్రులు సీతక్క, కొండ సురేఖ, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి,గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజులు మాట్లాడారు. నాయకులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.