Revanth Reddy : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తి కోయల దాడిలో ఫారెస్ట్ రేంజ్ అధికారి(ఎఫ్ఆర్వో) చలమల శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శ్రీనివాసరావుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
పోడు భూములపై హక్కులు కల్పిస్తామని గత 8 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులను ఊరిస్తూ వస్తోందన్నారు. మరోవైపు అటవీ భూములను సేద్యం చేస్తున్నారని గిరిజనులపైకి అధికారులను ఎగదోస్తూ చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల తెలంగాణ వచ్చినప్పటి నుంచి అటవీ శాఖ అధికారులు, గిరిజనులకు మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయన్నారు. పోడు భూముల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు మొక్కలు నాటేందుకు రావడం, గిరిజనులు అడ్డుకోవం.. వారి మధ్య గొడవలు జరగడం పరిపాటిగా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది గిరిజనులపై కేసులు పెట్టారు. పోడు భూములు సాగు చేస్తోన్న రైతులు పోరాటాలు, ఉద్యమాలు చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా పోడు భూములకు పట్టాలనిస్తామని చేసిన ప్రకటను మూడేళ్లు దాటిపోయింది. మంత్రి సత్యవతి రాథోడ్ చైర్ పర్సన్‌గా ఓ కమిటీని నియమించి 14 నెలలు దాటింది. ఇంత వరకు అతీగతీ లేదు. అధికారులు అభద్రతా భావంతో విధులు నిర్వహించాల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆ లేఖలో రేవంత్ తెలిపారు.