నా ప్రతి అడుగు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికికృషి చేస్తానని, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ములుగు నియోజకవర్గ ఓటర్లకు రుణపడి ఉంటానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు.
హైదరాబాదులోని సచివాలయంలో మొదటి అంతస్తులో కేటాయించిన తన కార్యాలయాలలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించగా ఆయా శాఖల రాష్ట్ర అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని సమ్మక్క సారలమ్మ దీవెనలతో రానున్న రోజుల్లో అన్ని రంగాలను అభివృద్ధిలో చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ములుగు ప్రజల రుణాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని, ఎన్నికల ముందు తాను ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేసి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని తెలిపారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరగనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతరను విజయవంతం చేయడంతో పాటు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని, మేడారంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 75 కోట్ల రూపాయలను కేటాయించిందని అవసరం ఉన్న పక్షంలో మరిన్ని నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
ఈ సందర్భంగా ఆయా శాఖలో ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు సీతక్కకు శుభాకాంక్షలు తెలిపారు.