Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Shadnagar: విష్ణువర్ధన్ రెడ్డికి ఎదురు దెబ్బ?

Shadnagar: విష్ణువర్ధన్ రెడ్డికి ఎదురు దెబ్బ?

ఇండిపెండెంట్ గా బరిలోకి ?

షాద్నగర్ భారతీయ జనతా పార్టీలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. పాలమూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి అసెంబ్లీ టికెట్ ఆశించిన ఆయనకు అధిష్టానం మొండి చేయి చేయించింది. వాస్తవానికి షాద్ నగర్ బిజెపి టికెట్ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. గత మూడేళ్లుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు పార్టీ గుర్తిస్తుందని గంపెడాశతో ఉంటూ వచ్చారు. చివరాఖరికి అధిష్టానం అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు అందె బాబాయ్యకు అవకాశం కల్పించింది. షాద్ నగర్ అసెంబ్లీ బిజెపి టికెట్ విషయంలో ఆ పార్టీ ఎన్నికల చైర్మన్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చక్రం తిప్పారు. తన శిష్యుడు బాబయ్యకు టికెట్ కావాలని కచ్చితంగా పట్టుబట్టడంతో విష్ణువర్ధన్ రెడ్డికి మొండి చెయ్యి మిగిలింది. మొదటి నుండి బిజెపి టికెట్ కోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి, అందే బాబయ్య మధ్య పోటీ నడిచింది. ఒకవైపు టికెట్ కోసం జితేందర్ రెడ్డి ఈటల రాజేందర్ ప్రతిష్టగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మారిన రాజకీయ సమీకరణలతో పాలమూరు అసెంబ్లీ బరిలో జితేందర్ రెడ్డి నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే పాలమూరు అసెంబ్లీ బరిలో తాను పోటీ చేయబోనని స్పష్టంగా జితేందర్ రెడ్డి చెప్పడంతో ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి అవకాశం కల్పించారు. దీంతో షాద్ నగర్ టికెట్ పోటీలో ఉన్న మిథున్ రెడ్డి స్వయంగా తప్పుకోవడంతో అందే బాబయ్య రొట్టె విరిగి నేతిలో పడినట్టయింది. ఈటల రాజేందర్ కు లైన్ క్లియర్ అయింది. కుల సమీకరణలతో బాబాయ్యకు అవకాశం వచ్చింది. అంతేకాకుండా రాజకీయాల్లో ఎంతో అనుభవం గడించిన బాబయ్యకు తెలుగుదేశం శ్రేణుల్లో చాలా పరిచయాలు ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీలో కూడా అనేక పరిచయాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీల్లో ఆయన అనుచరులు కార్యకర్తలు కూడా ఆయనతో అంతర్గతంగా కలిసి ఉంటారు. దీంతో బాబాయ్యకు సామాజిక కోణంలో ఓట్లు, ఆయా పార్టీలో పనిచేసిన సందర్భంగా పరిచయాలకు ఓట్లు పడే అవకాశం ఉన్నట్టు అధిష్టానం భావించింది. అందుకే బాబాయ్యకు టికెట్ ఫైనల్ చేసింది. అంతేకాకుండా బాబయ్య హిందూ దార్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఆయన స్వతహాగా రైతు కూడా. ఈ అంశాలన్నీ ఆయన టికెట్ ఫైనల్ కావడానికి అనుకూలించాయి. ఇక విష్ణువర్ధన్ రెడ్డి ట్రస్ట్ పేరిట కోట్లాది రూపాయలు వెచ్చించి భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లారు. ప్రతి ఇంట్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ పేరు గుర్తుపడుతున్నారంటే దానికి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చీరల పంపిణీ, హెల్మెట్లు, అంబలి, ఔషధాల పంపిణీ ఇంకా ఉపాధి కల్పన తదితర కార్యక్రమాలు ప్రజల్లోకి బాగా పోయాయి. విష్ణువర్ధన్ రెడ్డి కచ్చితంగా తనకు టికెట్ వస్తుందని ఆశించారు. తనదైన శైలిలో కొంతమంది యువతను తన వద్ద నియమించుకొని ట్రస్టు కార్యక్రమాల పేరిట పెద్ద ఎత్తున రాజకీయంగా రాణించగలిగారు. ప్రత్యేక సర్వేలు కూడా చేయించారు. రాజకీయాల్లో తనకు అనుకూల పరిస్థితి ఉందని భావించారు. వీటిని అధిష్టానము కూడా పరిశీలించింది. అయినప్పటికీ ఈటెల రాజేందర్ కు అధిష్టానం ఎదురు చెప్పలేకపోయింది. ఈటల రాజేందర్ ప్రధాన అనుచరుడిగా రాష్ట్రంలో అందెబాబయ్యకు పేరు ఉంది. బాబయ్య టిఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శి హోదాను అనుభవించేవారు, ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కూడా అధికార పార్టీలో ఉండేది. అయితే ఈటెల రాజేందర్ కోసం త్యాగం చేసి రావడంతో ఈ ఎన్నికల్లో టికెట్ ఆయనకు వచ్చేందుకు పూర్తిగా సహకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు..? అనేది చర్చగా మారింది. విష్ణువర్ధన్ రెడ్డి తన అనుచరులతో సంప్రదింపులు జరుపుకొని రాబోయే రెండు మూడు రోజుల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన అనుసర వర్గం భావిస్తుంది. ముఖ్యంగా తను చేసిన సేవా కార్యక్రమాలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని అందుకోసమే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడాలని తలంపుతో ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News