Friday, July 5, 2024
Homeపాలిటిక్స్Shadnagar: షాద్ నగర్ ఎన్నికల బరిలో టీడీపీ

Shadnagar: షాద్ నగర్ ఎన్నికల బరిలో టీడీపీ

చారిత్రాత్మక శక్తిగా తెలుగుదేశం

బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పేదల సంక్షేమం కోసం అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 2023 శాసనసభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అది వచ్చేది కాదు పోయేది కాదు అన్నోళ్ళకు చెంపపెట్టుగా మార్చే ప్రయత్నం జరుగుతుందా? అంటే జరుగుతుందనే చెప్పాలి.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలుగుదేశం పార్టీ పరిస్థితి మారిపోయింది ఇది ఎవరు అవునన్నా కాదన్నా జగమెరిగిన సత్యం. అంతమాత్రాన తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద స్థాయిలో ఉన్నారన్న వాస్తవాన్ని కూడా ఒప్పుకోక తప్పదు. అంతేకాదు బక్కని నర్సింహులు తెలుగుదేశం పోలీట్ బ్యూరో సభ్యులుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు కూడా చేపట్టి ఒక పర్యాయం ఎమ్మెల్యేగా కూడా అనుభవం గల బడా నాయకుడుగా చలామణి అవుతున్న సంగతి కూడా విధితమే. నర్సింహులు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నారు. ఎవరేన్ని పరిస్థితులు చెప్పినా చరిత్రలు చెప్పిన తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అభిమానులు అంతర్గతంగా పెద్ద ఎత్తున ఉన్నారన్న విషయం మాత్రం మరచిపోకూడదు. ఈ నేపథ్యంలో 2023 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర పెద్ద ఎత్తున ఉండబోతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 1985లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతున్న సమయంలో షాద్ నగర్ నియోజకవర్గంలో మహిళా అభ్యర్థి ఎం. ఇందిర భారీ మెజార్టీతో గెలిచి తెలుగుదేశం మొట్టమొదటిసారిగా షాద్ నగర్ అసెంబ్లీలో బోనీ కొట్టింది. ఆ తర్వాత 1994లో ఎవరు కనివిని ఎరుగని రీతిలో బక్కని నరసింహులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 45 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటివరకు బక్కని నరసింహులు పేరు మీద ఉన్న రికార్డ్ ఎవరు అందుకోలేదు. అందుకే రాజకీయాల్లో ఆయనకు సాటి ఎవరూ లేకుండా పోయారు. బక్కని నరసింహులు ఒక ఆత్మ అభిమానం గల నాయకుడు. ప్రలోభాలకు లొంగకండా, పదవుల కోసం అడ్డమైన పైరవీలు చేయకుండా, నమ్ముకున్న పార్టీ అన్న ఎన్టీఆర్ సిద్ధాంతం కొసం ఇంకా ఈ రోజుల్లో అదే పార్టీనీ పట్టుకొని వేలాడుతున్నారంటే ఆయన వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. బక్కని నరసింహులు ఒక ఆధ్యాత్మికవేత్త, తాను నమ్ముకున్న నాయకుడు చంద్రబాబు కోసం ఆయన ఈ నియోజకవర్గంలో ఇంకా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్ని గ్రామాల్లో ఆయనతో టచ్ లో ఉన్నారు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వీరాభిమానులే. గ్రామాల్లో పాతతరం, మధ్యతరం నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ పేరు చెబితే వారి మొహాల్లో ఆనందం కనిపిస్తుంది.

- Advertisement -

ఇదీ సంగతి..

1994లో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు రికార్డు స్థాయి గెలుపు అందుకున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఆ తరువాత అంతకన్నా ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నాయకులు నేడు టిఆర్ఎస్ నాయకుడు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కూడా ఆ పార్టీ నుండి దిగుమతి అయినవారే. 1994లో విజయాన్ని అందుకున్న తర్వాత 1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని కీలక తప్పిదం చేసింది. ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.శంకర్ రావు తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ పొత్తు అభ్యర్థి ఎస్.బాలుపై 6010 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శంకర్ రావుకు 56195 ఓట్లు లభించగా, ఎస్.బాలు 50185 ఓట్లు పొందినారు. మొత్తం ఐదుగురు పోటీచేయగా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే కొనసాగింది. బరిలో ఉన్న మిగితా ముగ్గురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు. ఇక్కడ పొత్తు పెట్టుకున్నందుకు తెలుగుదేశం పార్టీకి అవకాశం లభించలేదు ఒకవేళ అవకాశం ఉన్నట్టయితే ఖచ్చితంగా బక్కని నరసింహులు గెలిచేవారు. ఆ తర్వాత 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.శంకర్ రావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బక్కని నర్సిములుపై 10,632 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శంకర్ రావుకు 65360 ఓట్లు రాగా, బక్కని నర్సిములు 54,728 ఓట్లు సాధించారు. ఓటు బ్యాంకులో తిరుగులేకుండా తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన ఘనత బక్కని నరసింహులుది.

అవునన్నా కాదన్నా..

అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల కోసం నాయకులు నేటికీ పరితపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఈ నియోజకవర్గంలో తనదైన శైలిలో రాజకీయం నడుపుతూనే ఉంటారు. అందరిలా వగలమారి రాజకీయాలు చేయకుండా నికార్సేన రాజకీయాలు మాత్రం బక్కని నర్సింహులు చేస్తారని ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు. ఓట్ల కోసం అడ్డమైన గడ్డి తినే నేతలు ఉన్న ఈ కాలంలో నిజాయితీగా రాజకీయాలు చేయడం బక్కని నరసింహులుకే చెల్లిందని అందరూ అంటారు. తెలుగుదేశం పార్టీ ఎంత కష్టకాలంలో ఉన్నా ఆయన పార్టీని వీడలేదు.. ఎన్నో పార్టీలు ఆయనకు స్వాగతం పలికాయి. అయితే ఆయన మాత్రం నమ్ముకున్న తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలకు ఆయన పొత్తు సందర్భంగా సేవలు అందించారు తప్ప ఏనాడు పార్టీని వీడి వెళ్లలేదు. అధిష్టానం ఎంత చెబితే అంత అందుకే ఆయనకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలను చంద్రబాబు నాయుడు స్వయంగా అప్పజెప్పారు. ఇప్పుడు పోలీట్ బ్యూరో సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు. బక్కని నరసింహులు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడుగా కూడా సేవలందించారు. ఆయన లోని ఆధ్యాత్మిక చింతన భక్తిని గుర్తించి నేటికీ చంద్రబాబు ఆయనను ఎంతో గౌరవిస్తారు.

2023 ఎన్నికల్లో..

2023 ఎన్నికల్లో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు తన ఆలోచనకు పదును పెడుతున్నట్టు సమాచారం. ఆయన పోటి చేస్తారా లేదా? తెలియదు కానీ ఎన్నికల్లో మాత్రం కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. అంతేకాదు బక్కని నరసింహులుకు టికెట్ ఆశించేందుకు ఓ బడా నాయకుడు ప్లాన్ వేశారు. ఎలాగైనా టికెట్ ఇస్తే మళ్లీ పాత తరం తెలుగుదేశం నాయకులను తెరపైకి తీసుకువచ్చి ఈ ఎన్నికల్లో సత్తా చాటడం లేదా గెలుపు, ఓటములను నిర్ణయించే చారిత్రాత్మక శక్తిగా ఎదగడం అన్న కోణాల్లో తర్జన భర్జన జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. తెలుగుదేశం పోటీ చేస్తుందా పోటీ చేయకపోతే వారి మద్దతు ఎవరికి తటస్థంగా ఉంటారా లేక తెరవెనుక చక్రం తిప్పుతారా అన్న అనుమానాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇటీవలే చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆయనకు మద్దతుగా నియోజకవర్గ కేంద్రంలో బక్కని నరసింహులు పెద్ద ఎత్తున నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నారు. దీనికి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది. వాళ్లు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వక తప్పలేదు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అదేవిధంగా ప్రతిపక్ష నేత వీర్లపల్లి శంకర్ లాంటి వారు కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News