రసవత్తరంగా ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మారాయి. నవీన్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డి మధ్య పోటా పోటీగా సాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఇరు పార్టీలు తమ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలను పకడ్బందీగా పలు క్యాంపులకు తరలించారు. ఇదివరకే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వలసల పర్వం కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రెండు పార్టీలు తమ పార్టీ నాయకులను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ గురువారం ఉదయం 28 మార్చి ప్రారంభమై సాయంత్రం ముగియనున్నది.
ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు తమ గెలుపుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ, తమ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నంలో సర్వం సంసిద్ధం చేసుకున్నారు. గెలిచేదెవరో ఓడేది ఎవరో త్వరలో తేలనున్నది. అభ్యర్థులు ఇద్దరికి ఇద్దరూ నేనంటే నేను అని సోషల్ మీడియా వేదికగా మాటల కత్తులు దూసుకుంటూ గెలుపు తమదేనని ధీమా వ్యక్తంచేస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.