ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, CBI వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా దురుపయోగం చేస్తున్నారో తాజా పరిస్థితే ప్రత్యక్షమైన సాక్ష్యమంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అంటున్నారు. మహా వికాస్ అగాఢి కూటమికి చెందిన పలువురు నేతలను కేంద్రం టార్గెట్ చేసి, వేధిస్తోందని ఇందుకు అస్త్రాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయంటూ పవార్ ఆరోపించారు. ఎన్సీపీకి చెందిన అనిల్ దేశ్ ముఖ్ శివసేన నేత సంజయ్ రౌత్ ఇలా వేధింపులకు గురవుతున్న వారిలో ఉన్నారంటూ పవార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి వేధింపులు మరొకరికి జరగకుండా ఉండేలా తాను ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడతానంటూ పవార్ వెల్లడించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ జైల్లో ఏడాది ఉండగా, సంజయ్ రౌత్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణల కారణంగా మూడు నెలలపాటు జైల్లో ఉండి బెయిల్ పై విడుదల అయ్యారు. ఎంపిక చేసిన వారిపై కేంద్రం ఇలా అన్యాయంగా దాడులు చేస్తోందని పవార్ చెబుతున్నారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ బెయిల్ పైన విడుదల అయిన మరుసటి రోజే పవార్ ఈ తరహాగా మాట్లాడటం విశేషం.