Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్తెలంగాణ బీజేపీ పగ్గాలు ఈటెల చేతుల్లోకి, కేంద్ర మంత్రిగా బండి?

తెలంగాణ బీజేపీ పగ్గాలు ఈటెల చేతుల్లోకి, కేంద్ర మంత్రిగా బండి?

వేడెక్కిన కరీంనగర్ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ గా మారనున్న కరీంనగర్ పాలిటిక్స్

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, బీజేపీలో ముదిరిన వర్గ విభేదాల మీద ఆ పార్టీ అధిష్టానం దృష్టి సాధించింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి పార్టీలో భారీ ప్రక్షాళన చేసేందుకు సన్నద్ధమైంది. అందులో భాగంగానే బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. పార్టీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేందర్ కు రాష్ట్ర సారధిగా బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయింది. దీంతో కాషాయ శ్రేణుల్లో నూతనోత్తేజం వస్తుందని పార్టీ అధిష్టానం బలమైన నమ్మకంతో ఉంది. ఈటెల రాజేందర్ పేరు 2021 లో జరిగిన ఉప ఎన్నికతో దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. రాష్ట్రంలో కెసిఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడు ఈటెల రాజేందర్ అయితేనే 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఈటెల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.
✳️ఈటెల ప్రస్థానం…
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈటెల కీలక నాయకుడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. తెరాస అధినేత కేసిఆర్ కు ఆప్తమిత్రుడుగా గుర్తింపు పొందిన ఈటెల 2001లో కేసీఆర్ పార్టీ ప్రారంభించిన నాటి నుండి ఆయనకు వెన్నంటే ఉన్నారు. 2004లో కమలాపూర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటి టిడిపి అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిని ఓడించి చరిత్ర సృష్టించారు. 2007 లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం గెలుపొందారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణమోహన్ పై గెలుపొందారు. 2011 లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం తిరిగి ఎమ్మెల్యే గా గెలుపొంది ప్రజాదారణ పొందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డి పై 57 వేల పై చిలుకు ఓట్లతో గెలుపొంది ప్రత్యేక రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. 2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డి పై గెలుపొంది రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. నాటకీయ పరిణామాల మధ్య 2021లో నాటి టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. తదనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ అంటే దాదాపు రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. హుజురాబాద్ లో జరిగిన ఉప ఎన్నిక దేశంలోనే ఖరీదైన ఎన్నికగా అభివర్ణించబడ్డ సమయంలో సైతం అధికార పార్టీకి ఎదురొడ్డి విజయం సాధించి ఓటమి ఎరగని, ప్రజాదరణ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. ఉప ఎన్నిక వరకు ఎప్పుడు ఈటెల రాజేందర్ నియోజకవర్గ ప్రజలందరితో మమేకమై ప్రజలే దేవుళ్ళు, నియోజకవర్గమే దేవాలయం ప్రజలందరూ తన కుటుంబం సభ్యులు అన్న చందనంగా ఉండేవారు. ఉప ఎన్నిక తర్వాత భాజపా కేంద్ర నాయకత్వం పార్టీ చేరికల కమిటీ బాధ్యతలు అప్పగించడంతో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను భాజపా వైపు దృష్టి మళ్లించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తున్నారు. ఈటెల అయితేనే రాష్ట్రంలో పార్టీ బలం పుంజుకుంటుందని భావించిన అధిష్టానం ఎట్టకేలకు ఈటెలకే రాష్ట్ర బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పనిచేసిన ఉద్యమకారుల చూపు భాజపా వైపు మల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.అధ్యక్ష పదవి ఎవరిని వారిస్తుందో వేచి చూడాలి ….

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News