Assembly: తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో.. అసెంబ్లీ కార్యదర్శి వి. నరసింహా చార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీకి స్వతంత్ర సభ్యుడిగానే హాజరవుతానని, ఇకపై తనను ఎవరూ కట్టడి చేయలేరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని రాజాసింగ్ తీవ్రంగా విమర్శించారు. పార్టీలోని కొందరు నేతల వైఖరి వల్లే ఈ దుస్థితి దాపురించిందని, వారి వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. “ఇప్పుడు నాకు ఎవరూ బాస్‌లు లేరు. నన్ను ఎవరూ అదుపు చేయలేరు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం దొరికింది” అని రాజాసింగ్ అన్నారు.
Read Also: The Hundred: హండ్రెడ్ లీగ్ లో 11 బౌండరీలతో జేసన్ రాయ్ బీభత్సం
బీజేపీపై విమర్శలు
అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయం వరకు సభలో మాట్లాడే అవకాశాన్ని బీజేపీ పార్టీ ఇచ్చేది కాదని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు సభలో తనకు మాట్లాడే అవకాశం ఇస్తే వివిధ అంశాలు లేవనెత్తుతానన్నారు. తనలాగే బీజేపీలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. దీనికి తాజా ఉదాహరణ చేవెళ్ల ఎంపీ వ్యవహారమేనని తెలిపారు. వారిలాగే చాలా మంది పదవులు పోతాయని పార్టీలో జరుగుతున్న ఇబ్బందులపై నోరు విప్పడం లేదన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా.. వాటిని కొంతమంది సర్వనాశనం చేశారంటూ బీజేపీలోని పలువురు నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకూ ఢిల్లీలోని బీజేపీ నేతల నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ఒకవేళ వస్తే ఇక్కడ నెలకున్న ఇబ్బందులను వారికి వివరించిన తర్వాతే మళ్లీ ఆ పార్టీలోకి వెళ్తానని స్పష్టం చేశారు. లేకుంటే చచ్చినా.. మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఇక పార్టీలోని పలువురు ఎంపీలు తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క ఎమ్మెల్యేను సైతం గెలిపించలేకపోయారని గుర్తు చేశారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు అసెంబ్లీ సమావేశాల ముందు బీజేపీలో కలకలం రేపాయి.
Read Also: Aadhar: చిన్నారుల ఆధార్ విషయంలో యూఐడీఏఐ కీలక అప్ డేట్


