ఏండ్లుగా పోడు వ్యవసాయ సాగు చేసుకున్న అర్హులైన గిరిజనులకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్. చట్టం నియమ, నిబంధనలకు లోబడి పోడు భూముల పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర గిరిజన, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోడు భూములు, మన ఊరు – మన బడి, కంటి వెలుగు, ఆయిల్ ఫామ్, ఉపాధ్యాయుల బదిలీలో, జీ.ఓ. నం. 58,59 అంశాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పోడు భూముల పట్టాల పంపిణీ ప్రక్రియలో భాగంగా అందిన దరఖాస్తులపై క్షేత్ర స్థాయి పరిశీలన, పూర్తి స్థాయి విచారణ, గ్రామ సభలు పూర్తి చేయడం జరిగిదని, ఫిబ్రవరిలో ఆర్.ఓ.ఎఫ్.ఆర్. చట్టంకు లోబడి అర్హులైన గిరిజనులకు పోడు భూములు పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అడవులను సంరక్షిస్తూనే.. చట్టంకు లోబడి అర్హులైన గిరిజన, గిరిజనేతర రైతులకు పోడు భూముల పట్టాలను అందిస్తామన్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ అర్హులందరికీ పోడు పట్టాలు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లకు సంబంధించి డి.ఎల్.సి. మాడ్యుల్స్ ఈ రోజు నుండి అందుబాటులోకి వస్తాయని, రెండు రోజుల్లో ఎస్.డి.ఎల్.సి నుంచి వచ్చిన దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈసందర్భంగా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ సభల తీర్మానాలు, ఎస్.డి.ఎల్.సి. మధ్య ఉన్న గ్యాప్పై సమీక్షించాలని, గిరిజనులకు సంబంధించి చట్టం ప్రకారం రెండు ఆధారాలు ఉంటే తప్పనిసరిగా ఆమోదించాలని తెలిపారు. పోడు భూములు పట్టాల కోసం వచ్చిన దరఖాస్తు తిరస్కరించే పక్షంలో సంబంధిత కారణాలను స్పష్టంగా తెలియజేయాలని జిల్లాలో కలెక్టర్లు ముందస్తుగా ఎస్.డి.ఎల్.సి. పూర్తి చేసిన దరఖాస్తులను ఆమోదించి ఫిబ్రవరి 6 నాటికి పోడు భూముల పట్టాలు ప్రింటింగ్ పూర్తి చేసి పంపిణీ కోసం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు.