ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ అంటే అక్షరాలా 120 కోట్ల మంది కంటే ఎక్కువ హిందువులు ఉన్నారు. వీరందరి కల సాకారమైన క్షణంగా అయోధ్య రామమందిరంలో బాల రాముడు కొలువు తీరాడు. రామ జన్మ భూమి అయిన సరయూ నదీ తీరంలోని అయోధ్యలో రాముడు జన్మించిన ప్రాంతం వివాదాస్పదంగా మారటంతో అక్కడ రామ్ లల్లాకు గుడి కట్టాలని హిందువులంతా 5 శతాబ్దాలుగా కలలు కంటున్నారు. అయితే బీజేపీ అగ్రనేత లాల్ కిషన్ అద్వానీ గుజరాత్ లోని సోమ్నాథ్ నుంచి అయోధ్య రథయాత్రను 1990 సెప్టంబర్ 25వ తేదీన ప్రారంభించారు. ఈ రథయాత్ర అక్టోబర్ 30వ తేదీన అయోధ్యలో ముగిసింది.
మందిర్ వహీ బనేగీ అంటూ గర్జించిన అద్వానికి శిష్యుడుగా నాడు రథయాత్రలో మోడీ కూడా కీలక పాత్ర పోషించి, నేడు ఆ రథయాత్రను తుది అంకానికి చేర్చిన ప్రధానిగా సరికొత్త చరిత్ర సృష్టించారు. నాడు సోమ్నాథ్ సే అయోధ్య తక్ అంటూ సాగిన రథోత్సవం నేడు తన చిట్టచివరి గమ్యాన్ని చేరుకుని రామజన్మ భూమిలో బాల రాముడు కొలువు తీరేదాకా సాగింది. అద్వానీ రథయాత్ర జరిగిన 32 ఏళ్లకు అయోధ్యలో రామ మందిరం సాకారమైంది.