వేములవాడ బీజేపీలో వచ్చిన భారీ కుదుపు దెబ్బకు ఈటలకు భారీ షాక్ తగిలింది. గత కొన్ని గంటలుగా తుల ఉమతో జరిగిన బీఆర్ఎస్ చర్చల ఫలితంగా ఆమె గులాబీ కండువా కప్పుకునేందుకు అంగీకరించినట్టు బీఆర్ఎస్ వర్గాలు న్యూస్ బ్రేక్ చేసాయి. దీంతో తుల ఉమా కారెక్కడం ఖాయంగా మారిందన్నమాట. కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమాకు స్థానికంగా మంచి పట్టు ఉంది. గతంలో బీఆర్ఎస్ లో చాలాకాలంపాటు కొనసాగిన ఉమ, ఆతరువాత ఈటలతో పాటు బీఆర్ఎస్ వీడి, బీజేపీలో చేరిపోయారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో తుల ఉమకు పట్టుపట్టి బీజేపీ టికెట్ ఇప్పించిన ఈటల, స్థానిక బీజేపీ నేతను పక్కనపెట్టటం విశేషం. దీంతో సొంత నియోజకవర్గంలో ఈటల బీజేపీ కార్యకర్తల ఆగ్రహాన్ని కూడా చవిచూడాల్సి వచ్చింది.
సిరిసిల్ల తెలంగాణభవన్ వేదికగా వినోద్ కుమార్, తుల ఉమతో మంతనాలు సుదీర్ఘంగా సాగించగా, ఆతరువాత లైన్లోకి వచ్చి ఉమతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా మాట్లాడి ఆమెను ఒప్పించారని బీఆర్ఎస్ వెల్లడించింది. దీంతో మరికాసేపట్లో ఉమ ఇంటికి వినోద్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు వెళ్లి ఆమెను అధికారికంగా పార్టీలోకి తీసుకురానున్నారు. బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం కావటంతో రేపు కేటీఆర్ సమక్షంలో ఆమె చేరిక ఖాయమైనట్టు బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది.