కేసీఆర్ పై తెలంగాణ ఉద్యమకారులు నిప్పులు చెరిగారు. గజ్జల కాంతం, పిడమర్తి రవి వంటివారు హైదరాబాద్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేసీఆర్ విధానాలు, కుటిల రాజనీతిపై ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 నుండి 23 వరకు తెలంగాణ ఉద్యమకారులను అణిచి వేశారు, నోరు మూసివేశారు… ప్రశ్నిస్తే కేసులు పెట్టారని వారంతా ఆరోపించారు.
గత 10 ఏళ్ళు రాష్ట్రంలో దుర్మార్గపు పాలన జరిగిందని, చావు నోట్ల తలా పెట్టాను అని ప్రజలను మోసం చేశాడని వారు ఆరోపించారు. ఉద్యమకారుల వల్లనే కేసీఆర్ నిరాహారదీక్ష దిగాడని, ఉద్యమంలో హరీష్ రావు రెచ్చగొట్టి యువత ఆత్మహత్యలకు ప్రేరేపించారని, ఉద్యమకారుల వల్లనే రాష్ట్ర ఏర్పడిందనే విషయాన్ని వీరంతా బల్లగుద్ది చెప్పటం విశేషం. తెలంగాణ ద్రోహులకు పదవులు కట్టబెట్టిన కేసీఆర్ ఎప్పుడో ఉద్యమద్రోహి అయ్యాడంటూ మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం
సెంట్రల్ కోర్టు హోటల్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన తెలంగాణ ఉద్యమకారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజాసంఘాల నేతలు, ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జలకాంతం వంటివారంతా హాజరయ్యారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదని, ఉద్యమకారులను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశ భావం వ్యక్తం చేస్తున్నామన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వడం, 25వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం అభినందనీయమని ఓయూ జేఏసీ ఛైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రజా సంఘాల జేఏసీ, ఓయూ జేఏసి తరఫున ధన్యవాదాలు తెలియచేసాయి.