తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా చేసిన విద్యుత్తుకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన 6,000 కోట్ల రూపాయల బకాయీలపై ఆయన రాజ్యసభలో ఒక కీలక ప్రకటన చేస్తూ, ఈ బకాయీలను తక్షణమే చెల్లించాలని ఆదేశించారు. ఎన్నిసార్లు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం ఈ బకాయీలను చెల్లించకపోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తమ ఆదేశాలను పాటించని పక్షంలో ఆర్.బి.ఐలో ఉన్న తెలంగాణ ఖాతా నుంచి ఈ బకాయీలను ఆంధ్ర ప్రదేశ్ కు చెల్లించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్. నరసింహారావు, వై.ఎస్.ఆర్.సి.పి సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆర్.కె. సింగ్ సమాధానమిస్తూ, తెలంగాణ ఖాతా నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు మినహాయించుకుని, ఆ నిధులను ఏపీకి పంపించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ ఖాతా నుంచి ఏపీకి బకాయీలు చెల్లించేలా ఆర్.బి.ఐకి ఆదేశాలు జారీ చేసే అంశంపై న్యాయశాఖతో సంప్రతింపులు జరుపుతున్నట్టు ఆయన చెప్పారు. అదే విధంగా ఆర్థిక శాఖతో కూడా ఈ విషయం గురించి చర్చిస్తున్నామని, ఏపీకి బకాయీలు చెల్లించేలా చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఎంత చెల్లించాలన్నది ఇప్పటికే నిర్ణయించడం జరిగిందని, ఈ రెండు
రాష్ట్రాల ప్రభుత్వాలతో విద్యుత్ శాఖ కార్యదర్శి ఇప్పటికే చర్చించారని ఆయన తెలిపారు.
రాష్ట్ర విభజన సమయంలో ఎక్కువ విద్యుత్ కేంద్రాలు ఏపీకి వెళ్లిపోవడంతో తెలంగాణకకు విద్యుత్ సమస్యలు ఎదురయ్యాయని, కాగా కేంద్రం ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా జరిగిందని ఆయన తెలిపారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం ఈ విధంగా ఆదేశించవచ్చని అంటూ ఆయన, తెలంగాణ ప్రభుత్వం మొదట్లో చెల్లింపులు జరిపిందని, కొద్దికాలం తర్వాత చెల్లింపులు ఆపేసిందని తెలిపారు. ఇటువంటి విషయాల్లో కేంద్రం చర్య తీసుకోవడానికి విభజన చట్టం అవకాశం కల్పిస్తోందని ఆయన వివరించారు. చెల్లింపులు జరపాలని కేంద్రం ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిందని, స్టే తెచ్చుకుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఏదో విధంగా ఈ వివాదాన్ని
పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.