ఈ తొమ్మిదేళ్లలో వనపర్తి జిల్లాలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి చిన్నారెడ్డిపై బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ సవాల్ విసిరారు. మంత్రి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అసత్య ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారనీ, అభివృద్ది చేతగాక ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చిన్నారెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లు నిద్రపోయిన చిన్నారెడ్డికి ఎన్నికల ముందు వనపర్తి గుర్తుకువచ్చిందనీ, నాలుగుసార్లు పదవి అనుభవించి చేసిన అభివృద్ది ఏంటో చూయించాలనీ అన్నారు.
9 ఏళ్లలో మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ది కండ్ల ముందు కనిపిస్తున్నదనీ, మరి కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ది కాకులు ఎత్తుకుపోయాయా? అని అన్నారు. ఎల్లకాలం నటనలతో జలను మభ్యపెట్టలేరు .. కాలం మారింది .. వనపర్తి ప్రజలు చైతన్యం అయ్యారు అన్న విషయం చిన్నారెడ్డి గుర్తెరిగితే మంచిదనీ సలహా ఇచ్చారు. వనపర్తి జిల్లా అయింది అబద్దమా ? వనపర్తికి మెడికల్, ఇంజనీరింగ్, ఫిషరీస్, అగ్రికల్చర్ కళాశాలలు అబద్దమా ? వనపర్తి రహదారుల విస్తరణ అబద్దమా ? చిన్నారెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
వనపర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాల పైగా సాగునీరు రావడం అబద్దమా ? వనపర్తి నియోజకవర్గంలో ప్రతి పల్లెలో గత తొమ్మిదేళ్లుగా చేస్తున్న అభివృద్ది పనులు దర్శనం ఇస్తున్నాయన్నారు. అభివృద్ది చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలకు దిగుతున్నారనీ, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి వనపర్తి చెరువులను పట్టించుకోకుండా ఇప్పుడు ఒక్క చెరువు సరిపోదా ? ఒక్క ట్యాంక్ బండ్ సరిపోదా అని మతిలేని ఆరోపణలు చేయడం చిన్నారెడ్డికే చెల్లిందని మనీపడ్డారు.వందేళ్ల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని మంత్రి వనపర్తిని అభివృద్ది చేస్తున్నారనీ, ప్రజల ఆశీస్సులతో విజయవంతంగా ముందుకుసాగుతున్నామనీ, భవిష్యత్ లోనూ ప్రజల అండదండలతో మరింత అభివృద్ది చేస్తామన్నారు.ఎన్నికలప్పుడే రాజకీయాలు,ఎన్నికల తర్వాత అభివృద్ది లక్ష్యంగా పనిచేయాలన్నది మా పార్టీ అధినేత కేసీఆర్ , మా మంత్రి ఆలోచన,ఆ దారిలోనే నడుస్తాం, వనపర్తి కోసం నిరంతరం కష్టపడతామని అన్నారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేష్ గౌడ్,నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్తగా వంగూరు ప్రమోద్ రెడ్డి,వనపర్తి పట్టణ సమన్వయ కర్తగా అరుణ్ ప్రకాష్,సీనియర్ సమన్వయకర్తగా రాములు యాదవ్, కౌన్సిలర్లు బండారు కృష్ణ, నాగన్న యాదవ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కురుమూర్తి యాదవ్, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.
Vanaparthi: అభివృద్దిపై చర్చకు సిద్ధమా?
ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్దే లక్ష్యం