కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా కొద్దిసేపటి క్రితం వెలిచాల రాజేందర్రావును ప్రకటించడంతో గత కొన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటి గత కొంతకాలంగా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠను రేకెత్తించగా ఎట్టకేలకు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల పేరును ప్రకటించడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సఫలీకృతమయ్యారు. రెడ్డి, వెలమ, బీసీ సామాజికవర్గాలకు చెందిన అభ్యర్ధులలో ఎవరికి అవకాశం కట్టబెట్టాలన్న విషయంలో పలు సర్వేలు, అభిప్రాయ సేకరణ చేస్తూ తర్జనభర్జన పడ్డ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం సమీకరణ నేపథ్యంలో చివరికి వెలిచాల రాజేందర్ రావుకే అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టాలని నిర్ణయం తీసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలతో కలిసి వెలిచాల రాజేందర్రావుకే టికెట్ ఇవ్వాలని కోరుతూ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర నాయకత్వం ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపా మున్షీ, సహ ఇన్చార్జి రోహిత్ చౌదరి కూడా వెలిచాల రాజేందర్రావు అభ్యర్థిత్వానికి ఓకే చెప్పారు. వెలిచాల రాజేందర్ రావుకు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో రాష్ట్రంలో వెలను సామాజికవర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక స్థానం కేటాయించినట్లు అవుతుంది.
✳️ వెలిచాలను ఎంపీ అభ్యర్థిగా గెలిపించే బాధ్యతను తీసుకున్న మంత్రి పొన్నం…
గతంలో కరీంనగర్ ఎంపీగా పని చేసిన అనుభవం ఉన్న ప్రస్తుత రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెలిచాల రాజేందర్రావును ఎంపీగా గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. అధిష్టానం సైతం పొన్నం మీద ఉన్న నమ్మకంతో వెలిచాలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించడంతో ఇక గెలుపే లక్ష్యంగా పొన్నం సైతం పావులు కదిపేందుకు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను, కార్యకర్తలను కొత్తగా పార్టీలో చేరుతున్న ఇతర ఇతర పార్టీల నాయకులను సమన్వయం చేస్తూ రాజేందర్రావుతో పాటు మంత్రి పొన్నం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
✳️ తండ్రి అడుగుజాడల్లోనే తనయుడు…
వెలిచాల రాజేందర్ రావు తండ్రి జగపతిరావు కరీంనగర్ ఎమ్మెల్యేగా గతంలో పని చేశారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజేందర్రావు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అయినా ఆయన 2006లో ప్రజారాజ్యం పార్టీ నుంచి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీచేశారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో బీఆర్ఎస్ కు దూరమై మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
✳️వెలిచాల రాజేందర్ రావు బయోడేటా….
👉చదువు… బి ఏ ఆనర్స్ (చరిత్ర)-రాంజాస్ కాలేజ్, ఢిల్లీ యూనివర్సిటీ (1978-1983), ఎంబీఏ-ఉస్మానిస్ విశ్వవిద్యాలయం (1981-1983)
👉వృత్తి…
మేనేజింగ్ డైరెక్టర్-పోచంపాడ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రై.లి. లిమిటెడ్ (నీటి సరఫరా మరియు నీటిపారుదల నెట్‌వర్క్ ఒప్పందాలు, పాన్ ఇండియా కార్యకలాపాలు),
👉రాజకీయ అనుభవం…
కరీంనగర్ లోక్‌సభ (ప్రజా రాజ్యం పార్టీ)-2009 లో పోటీ చేయగా 1,76,000 ఓట్లు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా (2007-2009) కొనసాగారు. స్వతంత్ర అభ్యర్థిగా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004 లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయగా 30,000 ఓట్లు వచ్చాయి.
2001-2004 వరకు టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువజన వ్యవహారాలు మరియు విద్యార్థి వ్యవహారాల ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. గుండి, గోపాలరావుపేట సింగిల్ విండో సొసైటీ చైర్మన్ గా-1989 లో పనిచేశారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా (1991-1994) లో పని చేశారు. స్టేట్ అసోసియేషన్ ఆఫ్ మార్కెట్ కమిటీ ఛాంబర్ జనరల్ సెక్రటరీ(1991-1994) లో పని చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా (1984-1989) వరకు పనిచేశారు. స్టేట్ కార్పొరేషన్ NEDCAP (నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)-రాష్ట్రంగా నియమించబడిన నామినీ డైరెక్టర్-1992 లో బాధ్యతలు నిర్వహించారు.
👉 ఆయన తండ్రి వెలిచాల జగపతిరావు గండి గోపాలరావుపేట్ సర్పంచిగా పనిచేశారు.
కాంగ్రెస్ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యేగా (1972-1978) ఎన్నికయ్యారు. తెలంగాణ 9 జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా (స్వతంత్ర, 1978-1984) పనిచేశారు.
కరీంనగర్ ఎమ్మెల్యే స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు (1989-1994)
ఏపీ సీసీ ప్రధాన కార్యదర్శిగా (1974–1978) వరకు పని చేశారు.
మార్క్‌ఫెడ్, చైర్మన్ గా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తించారు.
అఖిలపక్ష తెలంగాణా శాసనసభా వేదిక కన్వీనర్ (1991-1994) చైర్మన్ మరియు కన్వీనర్ 11 సభ్యులు స్వతంత్ర ఎమ్మెల్యే ఫోరం (1989-1994) కొనసాగారు. తెలంగాణ పుస్తకాల రచయిత, తెలంగాణ స్వాతంత్య్రం మరియు ఆందోళన సమరయోధుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
👉ఆయన తాత వెలిచాల కేశవరావు 1950 సంవత్సరంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గా పని చేశారు. స్వాతంత్ర సమరయోధుడు, పండితుడు, కవి మరియు రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా రాజకీయ నేపథ్యం ఉన్న వెలిచాల కుటుంబానికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.
మొత్తానికి వెలిచాల అనుచరుల్లో ఆనందం నెలకొంది. తమ అభిమాన నేత పేరు ప్రకటించగానే టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్ కాంగ్రెస్ లో నయా జోష్ నింపారు వెలిచాల.