Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Vemulavada: వేములవాడ బి.ఆర్.ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు

Vemulavada: వేములవాడ బి.ఆర్.ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు

కేటీఆర్ తన మార్క్ మొదలు పెట్టింది ఇక్కడే..

వేములవాడ నియోజకవర్గంలో, ముఖ్యంగా వేములవాడ పట్టణంలో బి.ఆర్.ఎస్ పార్టీలో రోజుకో లెక్కన చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీ మనుగడపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గత ప్రభుత్వంలో అడపాదడపా వార్తలు మినహా ఏనాడు కూడా పెద్దగా వార్తల్లోకెక్కని వేములవాడ నేడు తెల్లారిందే తరువాయి అన్నట్లు నిత్యం వార్తల్లో నిలుస్తూ, రాష్ట్ర ప్రజల చూపును తనవైపు తిప్పుకుంటోంది.

- Advertisement -

ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది…

బి.ఆర్.ఎస్ లో జరుగుతున్న పరిణామాలకు అసలు కారణం ఏంటి…? అనే పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేక కథనం మీ కోసం… షురూ చేసిన చోటే శుభం కార్డు పడనుందా….? వాస్తవానికి వేములవాడ నియోజకవర్గం ఏర్పాటైన 2009 నుండి నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ పార్టీ పటిష్టంగానే ఉంది. 2010లో ఎప్పుడైతే మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు తెలుగుదేశం పార్టీని వీడి బి.ఆర్.ఎస్ పార్టీలోకి వచ్చాడో అప్పుడు పార్టీ ఇంకా పటిష్టంగా మారింది. ఈ క్రమంలో ఆయన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నిక (2010)తో పాటు తర్వాత జరిగిన రెండు (2014, 2019) సాధారణ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రమేష్ బాబు వరుస విజయాలు సాధించి వేములవాడ గడ్డపై తన ఉనికిని చాటుకున్నాడు. అదే సమయంలో వేములవాడ నియోజకవర్గాన్ని బి.ఆర్.ఎస్ పార్టీకి కంచుకోటలాగా మార్చాడు. ఇక అంతా బాగానే ఉంది, మళ్ళీ 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రమేష్ బాబు విజయం ఖాయమని, వేములవాడ గడ్డ ఎప్పటికీ బి.ఆర్.ఎస్ అడ్డానే అని అందరూ భావించారు.

కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది

పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ఒకే ఒక్క ప్రకటన అందరి భావనను తలకిందులు చేయడమే కాకుండా షాక్ కు గురి చేసింది. అదే అభ్యర్థి మార్పు.. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే క్రమంలో పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ మొదలుకు మొదలే వేములవాడ ప్రస్తావన తీశాడు. పౌరసత్వ అంశంతో పాటు మరికొన్ని కారణాల వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబును మార్చుతున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇది చేయడం జరుగుతుందని ప్రకటించాడు. ఈ ఒక్క ప్రకటన వేములవాడ నియోజకవర్గంతో పాటు యావత్తు రాష్ట్రాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలా ఉండగానే ఎన్నికల సమయం దగ్గర పడింది. పార్టీ అభ్యర్థిని ప్రకటించే సమయం ఆసన్నమైంది. ఇక చేసేదేమి లేక మల్కాపేటకు చెందిన మరో సీనియర్ నాయకుడు చల్మెడ లక్ష్మీ నరసింహా రావును అభ్యర్థిగా ప్రకటించడం, దీన్ని రమేష్ బాబు వర్గీయులు వ్యతిరేకించడం, ఎన్నికల సమయంలో చల్మెడకు సహకరించకపోవడం, సొంత పార్టీ నేతలే పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం వంటి పలు రకాల కారణాలు ..చివరికి చల్మెడను ఓటమి చవిచూడటం ఇవన్నీ చకచక జరిగిపోయాయి. చివరికి బి.ఆర్.ఎస్ క్యాడర్ ను అతలాకుతలం చేయడమే కాకుండా పార్టీ మనుగడను ప్రశ్నార్ధకం చేసింది.

కౌన్సిలర్ల వలసలు

మున్సిపాలిటీ నుండి మొదలు వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా పార్టీ పరిస్థితి అంతా బాగున్నట్లే కనిపించింది కానీ ఎప్పుడైతే వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యిందో, అదే సమయంలో బి.ఆర్.ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి కౌన్సిలర్ల వలసలు మొదలయ్యాయో ఇక అప్పటి నుండి బి.ఆర్.ఎస్ పార్టీ పతనం ప్రారంభమైందనే చెప్పవచ్చు…ఒక్కొక్కరుగా మెల్లగా వెళ్లి, మరో 5మంది వెళ్లకున్న కాంగ్రెస్ అభ్యర్థికి మద్దత్తు తెలిపి, చివరకు వైస్ ఛైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇది చాలదన్నట్లు మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు త్వరలో చైర్మన్ పై కూడా అవిశ్వాసం పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వచ్చిందే చాన్స్ గా మరికొంత మంది కౌన్సిలర్లు మెల్లమెల్లగా అధికార పార్టీలోకి వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనక జరిగితే వేములవాడ నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ పార్టీకి శుభం కార్డ్ పడినట్లేనని, ఇదే విధానం రానురాను రాష్ట్రమంతా విస్తరించి, చివరికి బి.ఆర్.ఎస్ పార్టీ చాపర్ట్ ముగిసేలా చేస్తుందని, రాజన్న సాక్షిగా బి.ఆర్.ఎస్ పతనానికి బీజం పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కేసీఆర్ ఎప్పుడైతే అసెంబ్లీ టిక్కెట్లు ప్రకటించి, మొదలుకుమొదలే వేములవాడ ప్రస్తావన తీసుకువచ్చి, అంతా బాగున్న వేములవాడ బి.ఆర్.ఎస్ పార్టీలో కల్లోల్లం సృష్టించాడో అప్పుడే బి.ఆర్.ఎస్ పార్టీ చాప్టర్ ముగిసేందుకు ఆయనే పరోక్షంగా కారణమయ్యాడని, కేసీఆర్ తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయమే బి.ఆర్.ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేస్తోందని, ఇలా కేసీఆర్ “మార్పు షురూ చేసిన చోటు నుండే బి.ఆర్.ఎస్ పార్టీకి శుభం కార్డు పడనుందనే” వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వేచి చూడాలి మరి ఎములాడ రాజన్న తన మహిమలతో ఇంకా ఏం చేస్తాడో…?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News